'స్టార్ నైట్' ఒక ఆకర్షణ

రాష్టాన్ని ఇటీవల అతలాకుతలం చేసిన వరదల్లో బాధితులైన వారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలిచి నవంబర్ 7న నిర్వహించనున్న ఈ 'స్టార్ నైట్'కు గచ్చీబౌలీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నారు. ఇటీవల జరిగిన ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కన్సర్ట్ తరహాలోనే ఈ షో విషయంలోనూ విఐపిలు, రాజకీయనాయకులు, సెలబ్రెటీలు, బ్యూరోక్రాట్లకు సైతం ఉచిత పాస్ లు ఉండవు.
తెలుగు పరిశ్రమలోని అన్ని విభాగాల సమన్వయంతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఇందులో పాల్గొని తమ మధ్య ఉన్న ఐక్యతను చాటిచెప్పనున్నారు.
అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, జితేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్నసిన్హా వంటి హిందీ సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్, మేనల్లుడు అల్లు అర్జున్ సైతం ఈ ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఇటీవల నిర్వహించిన తొలి సమావేశంలో చిరంజీవితో సహా ఆయన కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. దీనిని తిరుపతిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మోహన్ బాబు ఎత్తిచూపారు. అనంతరం ఫిలిం ఛాంబర్ లో 'మా' ఏర్పాటు చేసిన రెండో సమావేశానికి చిరంజీవి సోదరుడు నాగబాబు హాజరయ్యారు. మోహన్ బాబు, చిరంజీవి మధ్య 'శాంతిదూత'గా డాక్టర్ దాసరి నారాయణరావు వ్యవహరించి సయోధ్య కుదిర్చినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications