చిరంజీవికి ఇష్టమైంది

అయితే, ఇటీవలి కాలంలో చిరంజీవి మాటలు, చేతలు ఆయనకు రాజకీయాలపై కన్నా సినిమాలపై ఎక్కువ మక్కువ అనేది తెలియజేస్తున్నాయి. సినిమా విషయం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఆయన మనసు భావోద్వేగానికి గురి కావడం చూస్తాం. రాజకీయాలపై ఆయనకు విరక్తి కలిగినా ఆశ్చర్యం లేదు. కానీ, ఓసారి దిగిన తర్వాత ఆట ఆడక తప్పదనే పరిస్థితిని ఆయన ఎదుర్కుంటున్నారు. ఇప్పటికిప్పుడైతే ఆయన సేఫ్ గేమ్ ఆడదలుచుకున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసుకు ఆయన దగ్గర కావడంలోని అసలు విషయం అదే. కాంగ్రెసులో చేతులు కలిపిన తర్వాత ఆయనకు వెసులుబాటు కూడా లభించింది. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉన్నదానితో కాంగ్రెసుతో బేరసారాలు సాగించవచ్చు. లేదా అనివార్యమైతే పార్టీని కాంగ్రెసులో విలీనం చేయవచ్చు. అందుకే ఆయన ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయడాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి సినిమాలపైకి తన దృష్టిని మళ్లించారు. తనకు ఇష్టమైన పని చేయడానికి ఆయన ముందుకు దూకుతున్నారు.
ఇష్టమైన పనే అయినా దాన్ని కూడా తన రాజకీయానికి వచ్చే విధంగా మలుచుకోవడం ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. బహుశా, ఆయన సినిమా ఇతివృత్తం సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించిందై ఉంటుంది. తన 150వ సినిమా ఠాగూర్ లాగానో, స్టాలిన్ లాగానో ఉండాలనే మాటలోని ఆంతర్యం అదే. అయితే, దానికి పకడ్బందీ కథను తయారు చేయడం కావాలి. దాన్ని అంతకన్నా పకడ్బందీగా తెరకెక్కించే దర్శకుడు కావాలి. ఆ సినిమా విడుదలైన తర్వాత భవిష్యత్తు రాజకీయాలకు అది ఉపయోగపడే విధంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అందుకు అనుగుణంగానే కథా ఎంపికలోనూ, దర్శకుడి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకే తాము కథ కోసం వెతుకుతున్నామని చెప్పారు. ఇక్కడ కథే ముఖ్యం. చిరంజీవి ఇమేజ్ ఎలాగూ తోడవుతుంది.












Click it and Unblock the Notifications