చిరంజీవి రాజకీయాలకు, సిన్మాలకు చెడ్డ రేవడా?

తనకున్న లక్షలాది వీరాభిమానులకు కోట్లాది కాపు, దాని సంబంధిత కులాల వారు తోడవుతారని ఊహించుకుని చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి పేకమేడలు సినిమాల్లో కట్టవచ్చని, కానీ రాజకీయాల్లో నేల విడీచి సాము చేయరాదని చిరుబాబుకు ఆలస్యంగా తెలిసివచ్చింది. తాను ప్రేమతో వేసుకున్న మామిడితోటలో మొక్కలు ఎదగకుండా అలాగే ఉండడం ఆయన అసహనానికి కారణమవుతోంది. ఇప్పుడు ఆయన సినిమా అభిమానులు అంత అగ్సెసివ్ గా లేరు. వారు కొందరు పవన్ కు, రామచరణ్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా మారిపోయారు.
ఈలోపు రాజకీయ గండర గండళ్ళకే అర్ధం కాని పరిస్ధితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని అక్కడికి వెళ్లిపోవడం, కాకినాడ జనం పిలుస్తున్నారని అక్కడికి పరుగులు తీయడం చేస్తున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆయన మొదట్లో అనుకున్నారు కానీ ఇప్పుటికీ ఆయన రాజకీయ పరిపక్వత మీద సామాన్య ప్రజలకు కూడా సందేహాలు ఉన్నట్టు కన్పిస్తోంది.
మరో వైపు తనకు కుడిభుజం వంటి పవన్ కల్యాణ్, ఎడమ భుజం వంటి నాగబాబు ప్రజారాజ్యానికి దూరంగా ఉంటున్నారు. ఇక అన్నీ బావగారే అనుకునే చిరుకు అల్లు అరవింద్ రాజకీయ అలక కూడా బాధ కలిగిస్తోంది. అరవింద్ తన కోర్ ఏరియా అయిన సినిమా వ్యాపారంలోకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లో విసిగిపోయినా చిరంజీవి అందులో కొనసాగకతప్పని పరిస్ధితి ఏర్పడింది. రాజకీయాల్లోకి వచ్చాక గ్లామర్ ను, సున్నితత్వాన్ని కోల్పోయిన చిరంజీవి సినిమాల్లోకి తిరిగివెళ్ళడం ఇప్పుడు కాని పనే. ఆయన రాజకీయాల క్లైమాక్స్ సీన్ ఎలా ఉంటుందో కొంతకాలం వేచి చూస్తే గానీ తెలియదు.