వైయస్ జగన్ కు తెలంగాణ చెక్?

కాంగ్రెసు మీద తెలంగాణ ప్రజలకు పూర్తిగా నమ్మకం లేకపోయినప్పటికీ కాస్తా వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రంగంలోకి దిగి విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామాలైనా చేస్తామని ప్రకటించారు. కెసిఆర్ ఆ రకంగా కాంగ్రెసు తెలంగాణ నాయకుల ముందరి కాళ్లకు బంధం వేశారు. కానీ, కాంగ్రెసు తెలంగాణ నాయకులపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను విశ్వసించడానికి లేదని అంటున్నారు. వారు ముంచుతారో తేలుస్తారో కూడా తెలియని పరిస్థితి. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ డిమాండ్ పై ముందుకు రాకపోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు బ్రహ్మాండమైన ఆస్త్రం దొరుకుతుంది. వైయస్ జగన్ కాంగ్రెసును తప్పు పడుతూ తెలంగాణ అనుకూలం నిర్ణయంతో ముందుకు రావడానికి అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలంగాణలో తెరాసకు, తమకు తప్ప మరొకరికి స్థానం లేకుండా చేసే ఆలోచన కాంగ్రెసు అధిష్టానం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
కాగా, సీమాంధ్రలో చంద్రబాబును, వైయస్ జగన్ ను ఎదుర్కోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని వాడుకోవాలని చూస్తోంది. అందుకు దాదాపుగా చిరంజీవి కూడా సిద్ధపడినట్లేనని చెప్పవచ్చు. సమైక్యాంధ్ర నినాదంతో చిరంజీవి ముందుకు వచ్చినందున సీమాంధ్ర ప్రజలను తమ వైపు తిప్పుకోవడం సులభమే అవుతుందని అనుకుంటున్నారు. అదే సమయంలో వైయస్ జగన్ కు ఇప్పుడున్నంత ఊపు భవిష్యత్తులో ఉండకపోవచ్చునని కూడా అంచనా వేస్తున్నారు. వైయస్ జగన్ ను, చంద్రబాబును దెబ్బ తీయాలంటే తెలంగాణ అస్త్రమే ప్రయోగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణ అంశమే కాంగ్రెసును ముంచడమో, తేల్చడమో చేస్తుందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications