జగన్ ది ధిక్కారం కాదా?

సోనియాతో తమతో మాట్లాడిన విషయాలను వైయస్ జగనే బయట పెట్టారు. జగన్ చెప్పిన విషయాల ప్రకారమే సోనియా గాంధీ ఓదార్పు యాత్ర తీరుపై వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత పద్ధతిలో ఓదార్పు యాత్ర చేయవద్దని ఆమె స్పష్టం సూచించారు. ఆ కార్యక్రమాన్ని పార్టీ తరఫున చేపట్టాలని కూడా ఆమె చెప్పారు. వైయస్ మృతికి షాక్ తిని మరణించినవారి కుటుంబ సభ్యులను ఒక వేదిక మీదికి తెచ్చి సహాయం అందించాలని ఆమె సూచించారు. దాన్ని కూడా పార్టీ కార్యక్రమంగా చేపట్టాలని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని మాత్రం జగన్ దాచిపెట్టారు.
జగన్ ఓదార్పు యాత్ర చేస్తే తప్పేమిటని ప్రశ్నించేవారున్నారు. కానీ, నాయకత్వాన్ని కాదని, సొంత కార్యక్రమంగా చేపట్టడమే పార్టీ అధిష్టానానికి తీవ్ర అభ్యంతరమనేది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అనుమతించాల్సిన అవసరం అధిష్టానానికి లేదు, అనుమతించదు కూడా. ఏ రకంగా చూసినా జగన్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. వైయస్ ను పార్టీ నాయకుడిగా కాకుండా తన సొంత వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నం కూడా అటువంటిదే. పార్టీ తన మీద ఆధారపడి మాత్రమే మనుగడ సాగిస్తుందని, లేదంటే కుప్పకూలుతుందని జగన్ ప్రతి అడుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ లేకుండా నాయకులుండరని, పార్టీ వల్లనే వారు ఎదుగుతారని, వారికి పదవులు వస్తాయని గుర్తించడానికి ఆయన నిరాకరిస్తున్నారు.
కాంగ్రెసు పార్టీకి నాయకత్వం వహిస్తోంది సోనియా గాంధీయే అయినా, దాన్ని రాహుల్ ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నా పార్టీ ఎదుగుదలకు, విస్తరణకు సేవలందిస్తున్న హేమాహేమీలున్నారు. వారంతా జగన్ లాగే ఆలోచిస్తే పార్టీ అనేదే ఉండదు. జగన్ మాదిరిగానే ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ఆలోచిస్తే ఆ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఢిల్లీ నాయకులకు లేదు. ఏమైనా, జగన్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారనేది స్పష్టం. అలా ధిక్కరిస్తూ, పార్టీ అధిష్టానం వైఖరిని బలహీనతగా తీసుకుంటూ గందరగోళం సృష్టించడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications