సిఎంగా ఐదు నెలలు, రోశయ్య మొహంలో వెలుగు

డైనమిక్ ముఖ్యమంత్రి కాదన్న విమర్శలు ఉన్నా ఈ గడ్డు కాలంలో ఆయన పెద్ద దిక్కులా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. వైశ్య(కోమటి) కులాభిమానం ఆయనకు ఎక్కువగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఎపిఐఐసి చైర్మన్, సర్వీస్ కమిషన్ మెంబర్ నియామకాల ఆయన సోంతకులంవారికి కట్టబెట్టారన్న విషయం పొక్కింది. కాంగ్రెస్ హయాంలోనే అనేక మంది రెడ్డి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా పనిచేశారు. నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చినప్పుడు గతంలో తనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడంలో తప్పేమిటని కొందరు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అలా చేయడమే అసలైన నాయకుడి లక్షణమని సమర్ధిస్తున్నారు. రెడ్లు, కమ్మవారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమ కులం వాళ్ళని పైకి తెచ్చుకోలేదా అన్న సమర్ధనలూ విన్పిస్తున్నాయి.
రోశయ్య పెద్ద అవినీతిపరుడు కాకపోవడం మరో ప్లస్ పాయింట్. తెలంగాణపై ఇప్పట్లో అనుకూల ప్రకటన వెలువడే అవకాశం లేనందువల్ల మరో రెండు మూడేళ్ళు రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. గద్దె ఎక్కినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉండడంతో రోశయ్య మొదట్లో బెంబేలు పడినా తర్వాత నిలదొక్కుకున్నారు. కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకురాగల శక్తియుక్తులు లేకపోయినా సంక్షోభ సమయంలో రాష్ట్రానికి సారధ్యం వహించిన ఖ్యాతి ఆయనకు దక్కింది. ఆ విధంగా ఆయన చరిత్రలో మిగిలిపోతారు.
కాంగ్రెస్ అధిష్టానవర్గానికి నెలవారీ ముడుపులు పంపాల్సిన గురుతర బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుందన్న సత్యం అందరికీ తెలిసిందే. ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన రోశయ్య ముందే జాగ్రత్త పడ్డారు. వైఎస్ హయాంలో ఆ వసూల్ రాజా పాత్రను పోషించిన కెవిపి రామచంద్రరావును రోశయ్య అదే పనికి వాడుకుంటున్నట్టు కన్పిస్తోంది. రోశయ్య ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కెవిపి ఆయనతో కన్పిస్తున్నారు. వైఎస్ హయాంలో వచ్చినన్ని మామూళ్ళు ఇప్పుడు రాకపోయినా నామ్ కేవాస్తే గానైనా ఢిల్లీకి బదలాయింపులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. సిఎం క్యాంపు కార్యాలయానికి పూర్తిగా మారిన తర్వాత రోశయ్య కొన్ని డైనమిక్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.