కెటిఆర్ పై సాక్షి పొగడ్తలు

కెటిఆర్ ప్రతిభా పాటవాలపై మామూలు వార్తాకథనం కాకుండా ఆయనను ప్రశంసించడానికి ప్రత్యేకమైన పదప్రయోగం కూడా సాక్షి టీవీ చానెల్ వార్తా కథనంలో చోటు చేసుకుంది. కెటి రామారావు ప్రత్యర్థులపై అగ్నిపర్వతాలు పేలుస్తారని వ్యాఖ్యానించింది. ప్రత్యర్థులకు కెటిఆర్ చిక్కడు, దొకరడని పొగిడింది. ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా కూడా అభివర్ణించింది. కెటి రామరావు తండ్రి కెసిఆర్ ను మించిపోయారని తెరాస వర్గాలంటున్నాయని వ్యాఖ్యానించింది. ఈ పదప్రయోగాన్ని బట్టే సాక్షి టీవీ చానెల్ కు కెటిఆర్ రామారావుపై ఎంతగా అభిమానం, ప్రేమ పుట్టుకొచ్చాయో అర్థం చేసుకోవచ్చు. కెటిఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత విపరీతమైన వాదనా పటిమను, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, సమైక్యవాదాన్ని మోస్తున్న వైయస్ జగన్ తెలంగాణ ప్రత్యేకవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న కెటిఆర్ ను ప్రశంసించడానికి ఎందుకు అంగీకరించారా అనేది ప్రశ్న ప్రస్తుతం తొలుస్తోంది.
తనకు సీమాంధ్రులతో వ్యాపారాలున్నాయనే విషయాన్ని కెటిఆర్ స్వయంగా అంగీకరించారు. ఆ సీమాంధ్రులు ఎవరనే విషయాన్ని ఆయన వెల్లడించారు. దాని గురించి ఊహించుకోవాల్సిందే. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ సంస్థల్లో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. వారిలో కెటి రామారావు కూడా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేదంటే, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టడానికి వీలుగా జగన్ కెటిఆర్ ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది మరో అనుమానం. ఏమైనా, ఏదో మతలబు లేకపోతే సాక్షి చానెల్ లో అటువంటి వార్తాకథనం ప్రసారం కావడం సాధ్యం కాదనే విషయాన్ని అంగీకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications