జగన్ ఎఫెక్ట్: చంద్రబాబు డీల్?

వైయస్ జగన్ సీమాంధ్రలో పర్యటిస్తూ కాంగ్రెసు పార్టీ నేతలనే కాకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల నాయకులను కూడా ఆకర్షిస్తున్నారు. పైగా, రైతు సమస్యలపై వైయస్ దీక్ష ప్రభావం కూడా ఆ పార్టీల క్యాడర్ పై పడే అవకాశం ఉంది. ఈ స్థితిలో క్యాడర్ ను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా తాను కూడా రైతుల పక్షాన ఉన్నానని చాటుకోవడం చంద్రబాబుకు అనివార్యంగా మారింది. ఈ స్థితిలో ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చాలా వరకు తన ప్రాభవాన్ని కోల్పోయింది. కోస్తాంధ్రలో వైయస్ జగన్ పాగా వేస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం నుంచి జారుకునే ప్రమాదం ఉంది. వారిని నిలువరించడానికి చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేయాలనే తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారని భావించవచ్చు.
వైయస్ జగన్ 48 గంటల లక్ష్యదీక్ష ముగిసే వరకు కూడా చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగే అవకాశాలున్నాయి. చంద్రబాబుకు ఏదో రూపంలో చికిత్స చేయించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. బలవంతంగా సెలైన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయవచ్చు. చంద్రబాబు ఆరోగ్యం విషమిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పెరుగుతాయి. దీని వల్ల చాలా వరకు వైయస్ జగన్ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వీలవుతుంది. వైయస్ జగన్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కావాల్సింది. అందుకే, చంద్రబాబు దీక్షపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోంది.












Click it and Unblock the Notifications