సిఎంకు చెక్, జగన్‌తో ఢీ!

శనివారం సీఎంతో అధిష్ఠానం జరిపిన చర్చలో ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. సిఎంకు క్లాస్ కూడా తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఉదయాన్నే ఢిల్లీకి చేరుకున్న కిరణ్ తొలుత తన శ్రేయోభిలాషి అయిన కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలుసుకున్నారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో గంట పాటు మంతనాలు జరిపారు. ఆపై ఆజాద్‌తో కలిసి సోనియా నివాసానికి చేరుకున్నారు. ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా అక్కడికి చేరుకున్నారు. అంతాకలిసి సుమారు అరగంట పాటు రాష్ట్ర రాజకీయాలపై మథనం జరిపారు. చిదంబరం, ఆజాద్‌లతో జరిపిన చర్చల్లోనే కిరణ్‌కు అధిష్ఠానం వైఖరేమిటో తెలిసిపోయింది. కడప ఉప ఎన్నికల్లో పార్టీ గట్టి పోటీ ఇస్తుందని తాను చెప్పినదానికి పూర్తి భిన్నమైన ఫలితం రావడంతో సీఎం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ ఉనికి కోల్పోతున్నాయని వెల్లువెత్తిన ఫిర్యాదులపైనా జవాబు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏమైనా రాష్ట్ర పరిపాలనపై కాంగ్రెస్ ముద్ర పడేందుకు, పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేందుకు, ప్రజల ఆదరణ పొందేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలను సమష్ఠిగా తీసుకోవాలని అధిష్ఠానం ప్రతిపాదించింది. కీలకమైన నిర్ణయాలను సమష్ఠిగా తీసుకునేలా, రాష్ట్ర స్థాయిలో అనధికారిక స్థాయిలో సీనియర్ నేతలతో ఒక కమిటీ వేయాలనే అంశం చర్చకు వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీలాగా రాష్ట్ర స్థాయిలోనూ ఒక కమిటీ వేయాలని ఆజాద్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వైఎస్ పథకాలను ఎంత పకడ్బందీగా అమలు చేసినప్పటికీ, ఆ ఘనత ఆయన కుమారుడు జగన్‌కే దక్కుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
వైఎస్ చనిపోయి ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయినందున ఇక పార్టీని, ప్రభుత్వాన్ని వైఎస్ నీడలోంచి విముక్తి చేసి పాలనపై కాంగ్రెస్ ముద్ర పడే నిర్ణయాలకు అధిష్ఠానమే రూపకల్పన చేయనున్నట్లు తెలిసింది. జగన్ ఏకంగా పార్టీ పథకాలను తన జెండాలో పెట్టుకోవడం ద్వారా ఆ పథకాలను కాంగ్రెసు కాకుండా తన తండ్రి వైయస్ ప్రవేశ పెట్టాడన్న భ్రమను ప్రజల్లో కలిగిస్తున్నారని వారు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెసుకు దక్కాలంటే రాష్ట్రంలో వైయస్‌ను మరిపించాలని అధిష్టానం భావిస్తోంది. తద్వారా జగన్ లాభ పడకుండా చేయవచ్చని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సిఎం కిరణ్ పనితీరు, స్వభావంపై పలువురు నాయకులు చేసిన ఫిర్యాదులపైనా అధిష్ఠానం స్పందించింది. దీనిపై నేరుగా సిఎంకే సూచనలు చేసింది. మరింత క్రియాశీలకంగా, ప్రజాస్వామికంగా ఉండాలని ఆయనకు సూచించింది. ప్రభుత్వంలో అందర్నీ కలుపుకొని పోయేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై వీరు స్థూలంగా చర్చించినట్లు తెలిసింది.