దొర బుక్: ఎన్టీఆర్ గురించి సంచలనాలు

విశ్వామిత్ర సినిమాను ఎన్టీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసమే తీశారని, అయితే అది ఫ్లాప్ అయిందని ఆయన చెప్పారు. హరికృష్ణకు రాజకీయాలు వంట బట్టలేదని ఆయన అన్నారు. అయితే, తాను చేసిన ఈ వ్యాఖ్య అప్పటి పరిస్థితికి మాత్రమే అన్వయిస్తుందని ఆయన అన్నారు. అప్పుడు హరికృష్ణకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎన్టీ రామరావు వ్యవహారాలు చూసుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారని, ఎన్టీ రామారావుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు హరికృష్ణనే చేసేవాడని ఆయన వివరించారు.
ఈనాడు దినపత్రిక రామోజీరావు ఎన్టీ రామారావు వద్దకు తరుచుగా వస్తుండేవారని కూడా ఆయన రాశారు. తెలుగుదేశం పార్టీలో రెండు శక్తుల మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతుండగా మూడో శక్తి ప్రవేశించిందని దొర తన పుస్తకంలో రాశారు. లక్ష్మీపార్వతిని ఆయన మూడో శక్తిగా అభివర్ణించారు. తెలుగుదేశంలో ఎన్టీఆర్ అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, చంద్రబాబు మధ్య నిరంతరం ఆధిపత్య పోరు సాగుతుండేది. ఆ తర్వాత లక్ష్మీపార్వతి మరో శక్తిగా ముందుకు వచ్చారు. దీని గురించి ఆయన నిర్మొహమాటంగానే రాశారు.
ఎన్టీ రామారావుకు ఫైళ్లు చూడడంపై ఆసక్తి ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు క్షుద్రపూజలు చేసినట్లు గతంలో సాగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని తప్ప మరో దేవుడిని నమ్మేవారు కారని ఆయన చెప్పారు. 1994లో మంత్రి వర్గ కూర్పు సమయంలో ఎన్టీ రామారావుతో పాటు లక్ష్మీపార్వతి కూడా కూర్చోవడం తనకు ఇబ్బంది కలిగించిందని ఆయన చెప్పారు. ఇంటలిజెన్స్ అంశాలను తాము ముఖ్యమంత్రికి తప్ప మరొకరికి చెప్పబోమని, ఇంటలిజెన్స్ చీఫ్‌గా తాను వివరాలు అందించే సమయంలో తామిద్దరమే ఉండడం సంప్రదాయమని, కానీ మూడో వ్యక్తి ఉండేసరికి తాను తన అభిప్రాయాలు చెప్పే అవకాశం కలగలేదని ఆయన అన్నారు. ఓ సమయంలో చంద్రబాబు ఇంటికి వచ్చి ఎన్టీ రామారావు నుంచి పిలుపు రాకపోవడంతో అసంతృప్తితో వెళ్లిపోయారని కూడా ఆయన చెప్పారు.
ఎన్టీ రామారావుకు కుడి చేతి వేళ్లు స్వాధీనంలో ఉండేవి కావని, అందువల్ల సెల్యూట్ చేసే సమయంలో ఇబ్బంది పడేవారని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నించారని కూడా ఆయన రాశారు. మొత్తం మీద, ఇప్పటికీ ఎన్టీ రామారావు హాట్ టాపికే. పైగా, ఇంటలిజెన్స్ చీఫ్‌గా హెచ్‌జె దొర ఎన్టీ రామారావు పలు విషయాలు వెల్లడించారంటే అది మరింత అసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications