చిరంజీవి రాజకీయాల్లో రాటుదేలారా?

చిరంజీవి ప్రకటన చూస్తుంటే ఆయన రాజకీయాల్లో రాటు దేలినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు రాజకీయాలను కూడా ఆయన సరిగ్గానే అవగాహన చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. అదును చూసి డిమాండ్లను సాధించుకునే ఒత్తిడి రాజకీయాలు అవసరమని ఆయన గుర్తించినట్లే కనిపిస్తున్నారు. నిజానికి, ప్రజారాజ్యం పార్టీ విలీనం జరిగి చాలా కాలం అవుతోంది. కానీ, చిరంజీవికి సరైన స్థానం కల్పించలేదనే అభిప్రాయం ఉంది. అలాగే, చిరంజీవి వర్గానికి చెందిన శానససభ్యులు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు వస్తాయని వారు ఆశించారు. కానీ, ఇప్పట్లో రాజకీయ పరిణామాల దృష్ట్యా మంత్రి పునర్వ్యస్థీకరణ జరిగేట్లు కనిపించడం లేదు. నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సముఖంగా ఉన్నట్లు లేరు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగి, నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబుకే ప్రమాదం లేకపోలేదు. పదవులు దక్కని శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి వివిధ మార్గాలను ఎన్నుకునే అవకాశాలున్నాయి. దీంతో ముఖ్యమంత్రి వెనకాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, తమ డిమాండ్లను సాధించుకోవడానికి చిరంజీవి ప్రస్తుత పరిణామాలను వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా, కాంగ్రెసు పార్టీని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చిరంజీవి ఇరకాటంలో పెట్టినట్లే కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications