ఆత్మరక్షణలో కెసిఆర్?

అయితే తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్న సెంటిమెంటు దృష్ట్యా టిడిపి ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లి తెరాసపై వ్యతిరేకతను పెంచలేక పోయాయి. తెలంగాణ ఉద్యమం దృష్ట్యా తెరాస బలపడుతుందని భావించిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు గులాబీ కుండువా కప్పుకున్నారు. వేములవాడ శాసనసభ్యుడు రమేష్ తెలంగాణ కోసమంటూ టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుండి ప్రారంభమైన టిడిపి జంప్‌లు జోగు రామన్న వరకు కొనసాగాయి. ఇక నాగం జనార్ధన్ రెడ్డి వర్గం తెరాసలో చేరనప్పటికీ టిడిపికి దూరమయ్యారు. ఉద్యమం నేపథ్యంలో టిడిపికి ఏడుగురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధి ఉందని తెలంగాణ టిడిపి నేతలు ప్రకటించుకునేందుకు తెరాస కార్యక్రమాలలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ అక్కడ సాఫీగా ఉందా అంటే సమ్మెకు మద్దతు తెలపడానికి వెళ్లినా, ఆందోళన కార్యక్రమాలకు మద్దతు తెలపడానికి వెళ్లినా తెలంగాణ వాదుల నుండి ప్రశ్నలు.
చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటింప చేయాలని లేదంటే టిడిపి వీడాలని. దీంతో ఇన్నాళ్లూ తెలంగాణ టిడిపి నేతలు ఇన్నాళ్లూ ఎటూ పాలుపోలేని స్థితిలో పడిపోయారు. కానీ సమ్మె ప్రభావం తగ్గడం, పోలవరం టెండర్లు అంశం కారణంగా వారి చేతికి పదునైన ఆయుధం దొరకింది. నమస్తే తెలంగాణకు పోలవరానికి లింక్ పెట్టారు. నమస్తే తెలంగాణ ఎండి రాజాంకు పోలవరం టెండర్లు దక్కిన ష్యూ కంపెనీలో పెట్టుబడులు ఉన్నాయని, దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని, ఆధారాలు చూపేందుకు ఎక్కడికైనా వస్తామని చెప్పారు. కెసిఆర్ తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకొని తన పత్రిక ఎండి పెట్టుబడులు పెట్టిన కంపెనీకి టెండర్లు ఇప్పించారని ఆరోపించారు. ఎండి రాజాం సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన తర్వాతనే ష్యూ కంపెనీకి టెండర్లు దక్కాయని, రాజం గతంలో దివంగత వైయస్‌కు సన్నిహితంగా ఉండే వాడని ఇప్పుడు కెసిఆర్ పత్రికకు ఎండిగా ఉన్నారని ఆరోపిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టును బహిరంగంగా విమర్శించే తెరాస ఆ పత్రిక ఎండి పెట్టుబడులు పెట్టిన కంపెనీకి టెండర్లు దక్కడాన్ని ప్రశ్నిస్తోంది. ఇది తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని ఆరోపిస్తుంది. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని తెరాస అధినేత కెసిఆర్‌కు సవాల్ విసురుతోంది. అయితే రెండు వైపుల పెట్టుబడులు ఉన్నట్లు తెరాస చెబుతూనే అవి అతి తక్కువ శాతమని చెప్పింది. కెసిఆర్ కూతురు కవిత కూడా రద్దయ్యే టెండర్లు ఎవరికి వస్తే ఏమిటన్నట్లు మాట్లాడారు. తాము ఇప్పటికీ ఎప్పటికీ పోలవరంకు వ్యతిరేకమే అని చెప్పారు. అయితే పోలవరం ద్వారా తెలంగాణకు నష్టమని, ప్ర్తత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నామని చెబుతున్న తెరాస పెట్టిన పత్రిక ఎండి పోలవరం టెండర్ల కోసం మధ్యవర్తిత్వం వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యమం కారణంగా బయటకు రాలేక పోయిన టిటిడిపి నేతలకు పోలవరం రూపంలో బలమైన ఆయుధం దొరికింది. పోలవరం టెండర్లలో తెరాస పాత్ర ఉందని తెదేపా బల్లగుద్ది మరీ చెబుతుంటడంతో తెలంగాణలో ఇప్పుడు తెరాస ఇమేజ్ కొంత మసక బారినట్లుగా కనిపిస్తోంది. పోలవరం టెండర్లపై తెరాస నేతలు ఎంతగా వివరణలు ఇచ్చుకుంటున్నా ఆత్మరక్షణ ధోరణి వారిలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications