వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ ప్రభుత్వానికి ఢోకా లేదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మనుగడపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కూలిపోతుందా అనే ప్రశ్న అన్ని వైపుల నుంచీ వస్తోంది. ఇదే ప్రశ్న వేస్తే - ప్రభుత్వం కూలిపోతుందా, లేదా అనేది అప్రస్తుతమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి ఉన్న చివరి ఏకైక ఆయుధంగా దాన్ని ప్రయోగిస్తున్నామని ఆయన అన్నారు. అయితే, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంలో ఆయన ఆశించిన ఫలితం వేరు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సవాల్‌కు చంద్రబాబు ఆచరణాత్మకమైన ప్రతిసవాల్ విసురుతున్నారని చెప్పవచ్చు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ప్రభుత్వాన్ని కూలుస్తామని వైయస్ జగన్ అంటూ వస్తున్నారు. అవిశ్వాసం ప్రతిపాదించనందుకు చంద్రబాబును నిందిస్తూ వస్తున్నారు.

అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం ద్వారా జగన్ వైఖరిని ఎండగట్టాలనేది చంద్రబాబు వ్యూహం. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కూడా ఆయన ఉద్దేశం. బలపరీక్షకు సిద్ధపడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్న సమయంలో అతి వేగంగా కదిలి అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు ప్రతిపాదించారు. అంటే, విశ్వాస తీర్మానం ప్రతిపాదించి, నెగ్గితే క్రెడిట్ కిరణ్ కుమార్ రెడ్డికి దక్కుతుంది. ఆ క్రెడిట్ దక్కకుండా చేయడానికి కూడా చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ఉద్దేశించారు. కిరణ్ కుమార్ రెడ్డి బలపరీక్షలో నెగ్గితే ఏడాది పాటు అవిశ్వాసం పెట్టడానికి వీలు కాదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా, చంద్రబాబు మాటలను బట్టి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. మనుగడ సాగించడానికి అవసరమైన బలం కిరణ్ కుమార్ రెడ్డికి ఉందని లెక్కలు చెబుతున్నాయి. ప్రతిపక్షాల బలం శాసనసభలో 108 దాకా ఉంది. ప్రభుత్వం కూలిపోవాలంటే మరో 40 మంది శానససభ్యులు కావాల్సి ఉంటుంది. వైయస్ జగన్ వైపు 40 మంది ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. పైగా, కాంగ్రెసు పార్టీ జారీ చేసే విప్‌ను ధిక్కరిస్తే జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై అనర్హత వేటు కూడా పడవచ్చు. షోకాజ్ నోటీసులు అందుకున్న జగన్ వర్గానికి చెందిన నలుగురు కాంగ్రెసు సభ్యులపై, ఇద్దరు తెలుగుదేశం సభ్యులపై ముందుగానే అనర్హత వేటు పడినా ఆశ్చర్యం లేదు. దానివల్ల సభా బలం తగ్గిపోతుంది.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఏడుగురు మజ్లీస్ శానససభ్యులు, 16 మంది ప్రజారాజ్యం పార్టీ సభ్యులు మద్దతు ఇస్తాయనడంలో సందేహం లేదు. దానివల్ల ప్రభుత్వానికి మద్దతిచ్చే సభ్యుల సంఖ్య మెజారిటీకిపైగానే ఉంటుంది. ప్రస్తుతం ప్రజారాజ్యం, మజ్లీస్ సభ్యులతో కలుపుకుంటే కాంగ్రెసుకు 179 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెసు సభ్యుల్లో ఎంత మంది ప్రభుత్వానికి ఓటు వేస్తారనే విషయం, ఓటు వేస్తే చెల్లుతుందా లేదా అనే అంశం మాత్రమే ప్రధానమైంది. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉందని చెప్పడానికి లేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోదు.

English summary
It is clear that CM Kiran Kumar Reddy's government has strength to face No Confidence motion proposed by TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X