వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలం లేని జగన్, ధైర్యం లేని బాబు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెసు ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టాలంటూ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ, రెండు నిమిషాల్లో కాంగ్రెసును పడగొట్టగల శక్తి ఉందంటున్న జగనే కాంగ్రెసును పడగొట్టి చూపాలంటూ తెలుగుదేశం పార్టీ.. ఇలా సవాళ్లు, ప్రతిసవాళ్లతోనే వైయస్ఆర్ కాంగ్రెసు, టిడిపి పార్టీలు ఆగిపోతున్నాయి. కానీ ఏ ఒక్క పార్టీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధంగా కనిపించడం లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టినప్పటి నుండి కాంగ్రెసుతో పాటు టిడిపినీ లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రజా సంక్షేమం మరిచిన కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని జగన్, ఆయన కోటరీ పలుమార్లు టిడిపిని సవాల్ చేస్తూ వస్తోంది. అదే సమయంలో తనకు ముప్పై నుండి డెబ్బై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తనకు పడగొట్టే శక్తి ఉందని జగన్ కూడా అంటూ వస్తున్నాడు. అందుకు టిడిపి పార్టీ కూడా తమను సవాల్ విసరడం కాదని ముప్పై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న జగనే కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతి సవాళ్లు విసురుతూ వచ్చింది.

కడప ఉప ఎన్నికల ముందు వరకు సవాళ్లు, ప్రతిసవాళ్లు ఘాటుగా వినిపించినప్పటికీ ఆ తర్వాత అవిశ్వాసం అంశం క్రమంగా కనుమరుగయింది. జగన్ కడప పార్లమెంటు అభ్యర్థిగా భారీ ఆధిక్యంతో గెలిచిన అనంతరం జగన్ వర్గం టిడిపిని మరోసారి టార్గెట్ చేసుకుంది. టిడిపికి అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టగల శక్తి ఉన్నప్పటికీ కాంగ్రెసుతో లాలూచీ కారణంగానే పడగొట్టడం లేదని ఆరోపణలు కఠినతరం చేశారు. దీంతో టిడిపి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. వారి ఆరోపణలు సమర్థంగా తిప్పి కొట్టలేక పోయిన టిడిపి మహానాడులో మాత్రం జగన్‌కు గట్టి సవాల్ విసిరింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిత్యం తమను అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టమని డిమాండ్ చేసే జగన్ ముందుగా ఆయన తన ఎమ్మెల్యేలతో అవిశ్వాస తీర్మానం పెట్టిస్తే తాము ప్రభుత్వానికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని మహానాడు వేదికగా ప్రకటించి జగన్ వర్గాన్ని ఇరకాటానికి గురి చేశాడు. ఇన్నాళ్లూ ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో టిడిపి ఉండేది. ఇప్పుడు మాత్రం జగన్ వర్గం ఉంది. ఇన్నాళ్లు తమతో డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మేకపోతు గాంభీర్యం కనబర్చిన వైయస్ఆర్ కాంగ్రెసు తమకు ఎమ్మెల్యేల మద్దతు లేదని ప్రజల ముందు ఒప్పుకోక తప్పలేదు. అయితే టిడిపి, జగన్ పార్టీలు కేవలం సవాళ్లకే పరిమితం అయి కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టక పోవడానికి కారణాలు అనేకం.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా నిర్వీర్యం అయిన టిడిపి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎదుర్కొనే సత్తా కలిగి లేదు. అంతేకాదు, తండ్రి మరణం అనే సెంటిమెంటు కారణంగా జగన్ మంచి ఊపు మీద ఉండటంతో ఆటు సీమాంధ్రలో కూడా టిడిపికి అంత ఆశాజనకంగా లేదు. ఇందువల్లే టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్లలేక పోతోంది. అంతేకాదు జగన్‌తో ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని కూలదోయాలనే యోచన లేదు. ఆ విషయంపై కూడా టిడిపి ఆలోచిస్తుంది. తీరా అవిశ్వాసం ప్రవేశ పెట్టాక ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏమాత్రం లేదు. కాబట్టి అవిశ్వాసం ప్రవేశ పెట్టి వ్యర్థమవుతుందన్న భావనలో ఉంది. అందుకే జగన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. ఇక జగన్ వర్గంలో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు మించి సిద్దంగా లేరు. తమ పదవీ కాలం మరో మూడు సంవత్సరాలు ఉన్న ఈ సమయంలో ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎన్నికలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి వారిలో కనిపించడే లేదు. అంతేకాదు మళ్లీ గెలుస్తామా అనే ప్రశ్న కూడా వారిలో తలెత్తుతోంది. జగన్ కూడా ఒంటెత్తు పోకడలకు వెళుతున్నాడనే వాదనలు వినిపించాయి. దీంతో ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు సమయం, సందర్బం గురించి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జగన్ పంచన ఉన్నప్పటికీ 2014 వరకు ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూసి అప్పుడు ఆయన వెంట వెళదామనే ఆలోచనలో కూడా ఆయన వర్గంలోనే చాలా మంది ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెసుకు సొంతగా 155 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ ఆదేశాలు పాటించి ఎక్కువలో ఎక్కువ 15 నుండి 20 మంది కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసినా ప్రభుత్వం పడిపోదు. ఎందుకంటే పిఆర్పీకి చెందిన 17 మంది, ఎంఐఎంకు చెందిన 7గురు కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. వీటినన్నింటినీ, తెలంగాణ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని టిడిపి అవిశ్వాసానికి వెనుకడుగు వేస్తే, జగన్ వర్గంలోని ఎమ్మెల్యేలు మరో మూడేళ్లు ఉన్న కారణంగా ఓడుతామో గెలుస్తామో అన్న ఆందోళనతో పాటు తమకు పడగొట్టే మద్దతు లేదనే భావనతో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గుతోంది. అందుకే ఇరు పార్టీలు కేవలం సవాళ్లు విసురు కోవడానికే పరిమితం అవుతున్నారు కానీ పడగొట్టడానికి ముందుకు మాత్రం ఎవరూ రావడం లేదు.

English summary
Jagan has no strength and TDP has not confident to propose resolution on ruling congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X