తెలంగాణ అంశంపై లోకసత్తా అధ్యక్షుడు, శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ ఓ మెట్టు దిగి వచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇటీవల శాసనసభ ఆవరణలో తనపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన తీవ్ర మానసిక క్షోభను అనుభవించారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఆయన కొంత ఆత్మపరిశీలన చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. సోమవారం శాసనసభ ఆవరణలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది. తెలంగాణ రాజకీయ నాయకులపై ఆయన విరుచుకుపడకుండా తెలంగాణ సమస్యపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఆయన తెలంగాణ సమస్యపై సుదీర్ఘంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ సమస్య ఏనుగులా నిలబడి ఉందని, అలాంటప్పుడు సమస్యనే లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై శాసనసభలో నిర్దిష్టంగా, నిజాయితీగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్తగా ఓ రాజధాని వస్తుందని, దానివల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ప్రజల సమస్యలు తీరవని ఆయన ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చారు. స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా ఆయన అన్నారు. చాలా కాలంగా క్రమం తప్పకుండా ముందుకు తెస్తున్న ఈ వాదనను ఆయన కాస్తా పక్కన పెట్టారు. దాన్ని పక్కన పెట్టి సమస్యను పరిష్కరించాల్సిన అంశంపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఓ రకంగా ఇది జెపిలో వచ్చిన మార్పు. మిగతా సమైక్యాంధ్ర వాదుల మాదిరిగా కాకుండా కాస్తా సానుకూలంగా ఆయన మాట్లాడడం కొత్త పరిణామం.
సమస్యను దాని మానానికి దాన్ని వదిలేసి వ్యవహరించడం సరి కాదనేది ఆయన అభిప్రాయం. ఆ మాత్రం చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకుండా పోయిందనేది వాస్తవం. సమైక్యవాదాన్ని పుచ్చుకున్న మిగతా సీమాంధ్ర నాయకులు కూడా ఈ దిశగా ఆలోచిస్తే తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఈ రీత్యా జెపి సీమాంధ్రకు, తెలంగాణకు మధ్య ఓ మధ్యవర్తి పాత్రను పోషిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Loksatta president and MLA Jayaprakash narayana expressed his views on Telangana issue in a positive manner. It is to be invited by other Seemandhra leaders. seemandhra leaders to come forward top solve Telangana issue in amicable manner.
Story first published: Monday, February 21, 2011, 14:44 [IST]