చంద్రబాబుపై జూ ఎన్టీఆర్ వైరం

ఇకపోతే, హరికృష్ణ మహానాడులో వ్యవహరించిన తీరు కూడా చంద్రబాబుతో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి తగిన బలాన్ని చేకూరుస్తున్నది. మహానాడులో ప్రసంగించాలని కోరిన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని ఆయన కసురుకున్నారు. తాను మాట్లాడబోనని తెగేసి చెప్పారు. పైగా, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని కూడా చెప్పారు. ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీలో విభేదాలను బయటపెట్టడం ఇష్టం లేకనే ఆయన మాట్లాడలేదని అంటున్నారు. శుక్రవారం మధ్యలోనే మహానాడు నుంచి ఆయన వెళ్లిపోయారు. శనివారం స్పష్టంగా నాయకుల వద్ద తన అభిమతాన్ని బయటపెట్టారు. బాలకృష్ణ మాత్రం చంద్రబాబుకు మద్దతుగా నిలబడేట్లే ఉన్నారు. మహానాడు ప్రసంగంలో ఆయన చంద్రబాబును ప్రశంసించారు.
చంద్రబాబు ఆలోచన ఎలా ఉందనేది తెలియడం లేదు. హరికృష్ణను చంద్రబాబు పట్టించుకోవడం లేదా, కావాలనే పట్టించుకోనట్లు నటిస్తున్నారా అనేది తెలియడం లేదు. అయితే, మహానాడులో మాట్లాడాలని యనమల రామకృష్ణుడిని చంద్రబాబే అడిగించారని తెలుస్తోంది. హరికృష్ణ తీరు పట్ల చంద్రబాబుకు నచ్చడం లేదని కూడా చెబుతున్నారు. మహానాడు నుంచి హరికృష్ణ శనివారం నాడు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. తన వారసుడిగా నారా లోకేష్‌ను తేవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలే తండ్రీకొడుకులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు నచ్చడం లేదని చెబుతున్నారు. ఏమైనా, ప్రస్తుతం తెలుగుదేశంలో వారసత్వ పోరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోంది.