కసబ్‌కు రాచమర్యాదలు, హర్వీందర్‌పై చర్యలు?

1999లో కాందహార్ హైజాక్, 2000లో ఎర్రకోటపై దాడి, 2001లో భారత శాసనాలను తయారు చేసే పార్లమెంటుపై దాడి ఆ తర్వాత ముంబయి, హైదరాబాద్, గోవా పలు ముఖ్య పట్టణాల్లో ఉగ్రదాడులు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. దాడులు జరిగినప్పుడు మన పాలకులు ఖండించడం, నివాళులు అర్పించడం, ఇక నుండి ఇలాంటి జరగనివ్వమని మీడియా స్టేట్‌మెంట్ ఇవ్వటం మినహా వాటిని నివారించే చర్యలు పటిష్టంగా చేపట్టలేక పోవడం దారుణం. దాడుల నివారణలోనే కాదు నిందితులను శిక్షించడంలోనూ పాలకులకు ఓటు బ్యాంకు రాజకీయాలు అడ్డు వస్తున్నాయి. పార్లమెంటు దాడి వ్యూహకర్తను తానేనని స్వయంగా అఫ్జల్ గురు ఒప్పుకున్న అనంతరం కూడా ఆయనను శిక్షించడానికి మన ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు.
అఫ్జల్‌కు కోర్టు ఉరిశిక్ష విధించి ఏళ్లు గడుస్తున్నా శిక్ష అమలు చేయడం లేదు. శిక్షపై శషబిషలకు పోతున్న మన ప్రభుత్వాలు దాడి సమయంలో మన నేతలను రక్షించడానికి అసువులు బాసిన పోలీసుల పోరాట స్ఫూర్తిని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాయి. అంతేకాదు ముంబయి నగరంపై దాడి చేసి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన అజ్మల్ కసబ్ విషయంలోనూ మన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం కసబ్‌కు చేసిన ఖర్చు రూ.ఇరవై కోట్లు ఉంటుందట. అదే సమయంలో దేశంలో పెరుగుతున్న ధరల కారణంగా సామాన్యుడు బతుకునీడ్చడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడని ఆవేదన చెంది హర్వీందర్ సింగ్ వంటి యువకులు మన నేతలకు బుద్ధి చెప్పేందుకు చేయి చేసుకుంటే మాత్రం అలాంటి వారిపై మన పాలకులు కఠిన చర్యలకు ఆదేశిస్తారు!












Click it and Unblock the Notifications