భానుపై ఆయన వైఖరి వల్లే..

సుభాష్ చంద్ర బోస్ కుమారులు శ్యాంప్రసాద్, కృష్ణ ప్రసాద్ మధ్య ఆస్తి తగాదాలు తలెత్తాయి. కృష్ణ ప్రసాద్ భానును సంప్రదించాడు. అయితే దానికి ముందే సుభాష్ చంద్రబోస్, శ్యాంప్రసాద్ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై సిఐడి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది. కృష్ణ ప్రసాద్ తమను సంప్రదించడంతో భాను కిరణ్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. అన్నపూర్ణ ప్యాకేజింగ్ సంస్థల్లో ప్రధాన వాటా భాను కిరణ్ ముఠా చేతుల్లోకి వెళ్లింది. ఈ వ్యవహారంపై సీతారామాంజనేయులు వ్యవహరించిన పాత్ర విమర్శలకు తావిస్తోంది.
విజయవాడ సెటిల్మెంట్ వ్యవహారంలో సూరి అనుచరుడు భాను కిరణ్ ప్రధాన పాత్ర పోషించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, సూరి అనుచరులెవరూ రాలేదని సీతారామాంజనేయులు చెప్పారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన భానుకిరణ్, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి మిత్రుడు ప్రదీప్ కుమార్ రెడ్డి స్నేహితులని ఆయన అంగీకరించారు. అయితే, వివాదాన్నిసుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులే పరిష్కరించుకున్నారని, సూరి అనుచరులకు ఇందులో ఏ విధమైన పాత్ర లేదని ఆయన కొట్టిపారేశారు.
అయితే, సూరికి తెలియకుండా భాను కిరణ్ విజయవాడ వివాదంలో తలదూర్చాడని, కోట్లాది రూపాయలు భాను కిరణ్‌కు ముట్టాయని, దాంతో సూరికి, భానుకు మధ్య గొడవలు వచ్చాయని అంటున్నారు. ఈ వివాదంతో పాటు మరిన్ని ఆస్తి తగాదాల వల్ల భాను కిరణ్ సూరిని హత్య చేశాడని అంటున్నారు. విజయవాడ వివాదంలో జోక్యం చేసుకున్నప్పుడు భాను వ్యవహారంపై సీతారామాంజనేయులు కఠినంగా వ్యవహరించి ఉంటే సూరి హత్య జరిగి ఉండేది కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications