• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌కు ఓటమి భయం పట్టుకుందా?

By Srinivas
|

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎందుకు ఇంత అసహనానికి గురవుతున్నారు. ముప్పయ్యేళ్లుగా కడప, పులివెందులలో తమ పట్టు కోల్పోతామనే భావన వచ్చే వారు రెండు రోజుల క్రితం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై గుడ్లు, చెప్పులు, శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్టుగా కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.

కాంగ్రెసు నుండి బయటకు వెళ్లిన జగన్ ఆవేశంతో రాజీనామా చేసినప్పటికీ ఉప ఎన్నికలలో తన గెలుపు కష్టమని భావించే తన వారిని దాడులకు ఉసిగొల్పుతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇలా అందరినీ భయకంపితులను చేయడం ద్వారా ఎన్నికలు ఏకపక్షంగా జరిపించుకోవచ్చుననే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. సొంత అడ్డాలో, పట్టున్న ప్రాంతంలో వీలైనంత మేరకు ఏకపక్ష పోలింగ్‌ జరిపించుకోవాలన్న వ్యూహంతో ఇప్పటివరకు ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా అసహనానికి లోనవుతోంది.

ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులకు దిగుతోంది. ప్రచారానికి అడ్డంకులు కల్పిస్తోంది. యువనేత అనుచరులు అప్పటికప్పుడు ఆవేశానికి లోనై దాడులు చేయడం కాకుండా ఇవన్నీ ముందస్తు వ్యూహంతోనే జరుగుతుండడం గమనార్హం. సొంత గడ్డ పులివెందుల్లో వూహించని సవాళ్లు ఎదురువుతుండడం, విపక్ష పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకెళ్లడం, నేరుగా తన వ్యక్తిత్వంపైన, అవినీతిపైనా విమర్శలు చేస్తుండడం అన్నింటికీ మించి గత రెండు, మూడు రోజుల్నించీ కడప లోక్‌సభ ఉపఎన్నికల్లో మారుతున్న పరిస్థితులు జగన్‌ను ఆందోళనకు, అసహనానికి గురిచేశాయనే భావన వ్యక్తమవుతోంది.

దీనికితోడు గతంలో పులివెందుల నియోజకవర్గంలో పలు పోలింగ్‌ స్టేషన్లలో ఏకపక్ష పోలింగ్‌ జరిగేది. ఈసారి ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు ప్రచారంచేస్తూ జనంలోకి వెళ్తుంటే, ఆయా పార్టీలస్థానిక నేతలు, కార్యకర్తలు బలంగా నిలబడతారని, దీంతో ఏకపక్ష పోలింగ్‌ సాధ్యం కాదేమోనన్న ఆందోళన కూడా యువనేత వర్గంలో ఉందని విశ్లేషకుల భావన. దీని ఫలితమే ప్రత్యర్థి పార్టీల రాజకీయ నేతల ప్రచారంలో అలజడి సృష్టిస్తూ అనాగరిక ప్రవర్తనకు యువనేత వర్గం పాల్పడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం భాజపాతో పొత్తు విషయంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలతో ముస్లిం మైనార్టీల్లో కలకలం రేగింది.

పలు మైనార్టీ సంస్థలు జగన్‌కు వ్యతిరేకంగా కడపలో ర్యాలీలు నిర్వహించాయి. కడప లోక్‌సభ నియోజక వర్గంలో రెండు లక్షల ఓట్లున్న ముస్లింలు క్రమంగా యువనేత పార్టీకి దూరమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా... మరోవైపు తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల తరఫున అగ్రనేతలు ప్రచారానికి దిగడంతో జగన్‌ ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో జగన్‌ అవినీతి, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన కొద్ది సేపట్లోనే అధికారం కోసం ఆయనపడ్డ తాపత్రయం తదితర అంశాలను నియోజకవర్గ ఓటర్ల ముందు, తన సొంత అడ్డా అనుకున్న ప్రాంతాల్లో నేరుగా, సూటిగా చెబుతుండడం, అవి జనంలోకి చేరుతుండడం జగన్‌ జీర్ణించుకోలేక పోతున్నారు. కనీసం వైఎస్‌ఆర్‌కి అంత్యక్రియలు కూడా పూర్తికాకుండానే అధికారం కోసం పాకులాడుతూ తన దగ్గరకు 22 మంది ఎమ్మెల్యేలను రాయబారం పంపించారంటూ జగన్‌పై చిరంజీవి విరుచుకు పడ్డారు. అధికార దాహంతో ఏడాది కాకముందే తల్లితో రాజీనామా చేయించి ఆమెను నడి ఎండలో తిప్పుతున్నారని విమర్శించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్‌ అవినీతిపై చండ్ర నిప్పులు కురిపించారు. జగన్‌ లాంటి అవినీతిపరుణ్ని తరిమేసి కడప ప్రజల పౌరుషం చూపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటనకు జనం నుంచి మంచి స్పందన లభించడం, ఆయనతోపాటు చిరంజీవి పర్యటనలు విజయవంతం కావడం కూడా జగన్‌ వర్గంలో ఆందోళన పెంచాయనే భావన వ్యక్తమవుతోంది. దీంతో అసహనాన్ని వెళ్లగక్కుతున్నారని, దీని ఫలితంగానే సొంతగడ్డ పులివెందులలో చిరంజీవి, చంద్రబాబుపై దాడులు జరిగాయనే వాదన వినిపిస్తోంది.పులివెందులలో గతంలో ఏకపక్షంగా ఉండే యంత్రాంగంలో ఇప్పుడు విభేదాలు రావటం, రెండు వర్గాలుగా విడిపోయి చిన్నాన్న వివేకానందరెడ్డి వైపు పలువురు వెళ్లడాన్ని కూడా జగన్‌ జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.

పులివెందుల గడ్డ తనఅడ్డా అనుకుంటున్న జగన్‌ ఈ పరిస్థితిని భరించలేక పోతున్నారనే భావన ఉంది. కొన్ని రోజుల క్రితం నాటికి, ఇప్పటికీ కడప పార్లమెంటు స్థానంలో పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రమంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై జనంలో ఉన్న అభిప్రాయం మారుతూ వస్తోంది. మైనార్టీల్లో వచ్చిన మార్పు, కొన్ని సామాజిక వర్గాల్లో క్రమంగా పెరిగిన వ్యతిరేకత, తెదేపా, కాంగ్రెస్‌ పార్టీల నాయకుల ప్రచారానికి వస్తున్న స్పందన యువనేత వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇంకోవైపు కడప ఉపఎన్నికల పోరును నీతికి, అవినీతికి మధ్య యుద్ధమంటూ, ఇందులో అవినీతి జగన్‌ను ఓడించాలంటూ ప్రత్యర్థి పార్టీలు, పలు సంఘాలు చేస్తున్న ప్రచారం క్రమంగా జనంలోకి వెళ్తోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్ల ఓటింగ్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా. వైఎస్‌ కుటుంబం వేల కోట్లు సంపాదించడం, అనుచరులకు కోట్లు సంపాదించుకునే మార్గాలు చూపడం మినహా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చేసింది చాలా తక్కువనే అభిప్రాయం క్రమంగా వ్యాపిస్తోంది. మారుతున్న ఈ పరిస్థితులన్నీ యువనేత వర్గంలో ఆందోళనకు దారి తీశాయని, ఫలితంగానే ముందస్తు వ్యూహంతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

English summary
It seems, Ex MP YS Jaganmohan Reddy have fear of defeat so he encoraging attacking on TDP president Chandrababu Naidu and PRP president Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X