తప్పు సరిచేసుకోబోతున్న సుప్రీంకోర్టు..! చరిత్రలో మరో కీలక నిర్ణయం..!
సుప్రీంకోర్టు (Supreme Court) చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్దమవుతోంది. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్ధి సంఘం నేత ఉమర్ ఖాలిద్ ను ఢిల్లీ అలర్ల కేసులో 2020లో అరెస్టు చేసిన తర్వాత ఇప్పటివరకూ బెయిల్ ఇవ్వకుండా జైల్లో మగ్గబెడుతున్న ఘటనలో ఈ మధ్యే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతర కేసులతో సమానంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (UAPA) కేసుల్లోనూ సాధారణ కేసుల తరహాలోనే నిందితులకు బెయిల్ అర్హత ఉందని తేల్చేసింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ఉమర్ ఖాలిద్ కేసులో బెయిల్ సమీక్షకు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసింది.
ఉమర్ ఖాలిద్ సహా పలువురికి బెయిల్ మంజూరు చేయకుండా ఐదేళ్లకు పైగా తీహార్ జైల్లోనే ఉంచిన తర్వాత ఈ ఏఢాది జనవరిలో సుప్రీంకోర్టు ముందుకు మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. ఐదేళ్లుగా ఎలాంటి విచారణ లేకుండా ఈ కేసును వదిలేసిన సుప్రీంకోర్టు.. జనవరిలో సైతం తన వైఖరిని కొనసాగిస్తూ ఉమర్ ఖాలిద్ సహా పలువురికి బెయిల్ ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. అయితే తాజాగా ఈ తీర్పు తప్పేనని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దీంతో విస్తృత ధర్మాసనం విచారణలో ఈ తీర్పు చట్టబద్ధతను తేల్చనుంది. మరోవైపు ఆపరేషన్ చేయించుకుంటున్న తన తల్లిని కలుసుకునేందుకు వీలుగా ఉమర్ ఖాలిద్‌కు ఢిల్లీ హైకోర్టు 3 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇప్పుడు ఢిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులైన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పు చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమీక్షించనుంది. కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద బెయిల్ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు పరస్పర విరుద్ధమైన తీర్పుల వల్ల తలెత్తిన ప్రశ్నలకు విస్తృత ధర్మాసనం సమాధానం ఇవ్వాలని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సిఫార్సు చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. UAPA కింద బెయిల్ ఇవ్వడానికి విచారణలో సుదీర్ఘ జాప్యం సరైన కారణమా కాదా అనే విషయంలో ఈ రెండు తీర్పులు భిన్నంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో, సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం, ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లపై ఉన్న ఆరోపణలు ప్రాథమికంగా నిజమని, అందువల్ల విచారణలో సుదీర్ఘ జాప్యం జరిగిందన్న వారి వాదనలు చెల్లవని పేర్కొంటూ వారికి బెయిల్ నిరాకరించింది.

అయితే, ఈ వారం సుప్రీంకోర్టుకు చెందిన మరో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం, విచారణలో జాప్యాన్ని గమనిస్తూ, UAPA కేసులలో కూడా "బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు" అని పేర్కొంటూ, UAPA కింద నిందితుడైన ఒక వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన జనవరి తీర్పును కూడా ధర్మాసనం విమర్శించింది. ఈ రెండు తీర్పుల మధ్య ఉన్న వైరుధ్యమే, దీని ద్వారా తలెత్తిన చట్టపరమైన ప్రశ్నను ఒక విస్తృత ధర్మాసనం పరిష్కరించాలని మూడవ ధర్మాసనం సిఫార్సు చేయడానికి దారితీసింది. యూఏపీఏ కేసులో నార్కో-టెర్రర్ నిందితుడైన సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ, ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన జనవరి తీర్పు యొక్క చట్టబద్ధతను జస్టిస్‌లు బీవీ నాగారత్న, ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించడంతో ఈ వివాదం తలెత్తింది.














Click it and Unblock the Notifications