తెలంగాణలో పోటీకి జగన్ పార్టీ దూరం

తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న ప్రస్తుత సమయంలో పోటీ చేసి ఓడిపోవడం కన్నా పోటీ చేయకుండా ఉండడం వల్లనే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు అంటున్నారు. అయితే, ఉప ఎన్నికలను పార్టీ సిద్ధాంతాలను, కార్యాచరణను ప్రచారం చేసుకోవడానికి వేదికగా వాడుకోవడానికి వీలవుతుందని, దాన్ని ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం పోటీకి దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూ రాజీనామా చేసిన వారికి మద్దతిస్తే తెలంగాణ ప్రజల్లో పార్టీ గౌరవం పెరుగుతుందని, ఈ అవకాశాన్ని వాడుకుందామని ఆయన చెప్పినట్లు సమాచారం.
పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ వై. కిష్టా రెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కెకె మహేందర్ రెడ్డి వైయస్ జగన్‌ను విడివిడిగా కలిశారు. పోటీకి దూరంగా ఉండడం వల్ల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఎండగట్టడానికి వీలవుతుందని జగన్ వారితో చెప్పినట్లు తెలుస్తోంది. అకస్మికంగా మృతి చెందిన రాజేశ్వర రెడ్డి భార్యను మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీకి దించాలనే ప్రతిపాదనను జగన్ ముందుకు తెస్తున్నారు. ఇందుకు కెసిఆర్ కూడా అంగీకరించే అవకాశాలున్నాయి. ఇటీవలి కాలంలో ఖాళీ అయిన ఆదిలాబాద్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications