సిబిఐపై ఐఎఎస్ అధికారుల మండిపాటు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది గురువారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల పట్ల హైదరాబాదులోని సిబిఐ అనుసరిస్తున్న తీరును ఆయన సిబిఐ బాస్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిబిఐ తమను వేధిస్తోందంటూ పలువురు బ్యూరోక్రాట్లు ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తూ లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వోక్స్ వ్యాగన్ కేసు నుంచి బయటపడిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సిబిఐ ఎమ్మార్ కుంభకోణం కేసు చార్జిషీట్‌లో నిందితుడిగా చేర్చింది.
కుమారుడి పెళ్లి సమయంలో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యాన్ని తీవ్రమైన సంకట స్థితికి నెట్టినట్లు చెబుతున్నారు. పెళ్లికి వచ్చినవారు దంపతులను ఆశీర్వాదాలు అందించడాని కన్నా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఓదార్చడానికే సమయం పెట్టాల్సి వచ్చింది. ఈ విషయంపై బ్యూరోక్రాట్లు సిబిఐని ప్రశ్నించగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కుమారుడి పెళ్లి ఉన్నట్లు తమకు తెలియదని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చెప్పినట్లు సమాచారం. ఇదిలా వుంటే, ఐఎఎస్ అధికారులు అజయ్ మిశ్రా, రమాకాంత్ రెడ్డిలను సిబిఐ ప్రశ్నించింది. మరింత మంది ఐఎఎస్ అధికారులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications