చంద్రబాబు పాదయాత్ర: ఫ్యామిలీ తోడు ఇలా...
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్రకు కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందిస్తున్నారు. హిందూపురంలో చంద్రబాబు నుదుట తిలకం దిద్ది పాదయాత్రకు పంపించారు. భువనేశ్వరి ఆదివారం చంద్రబాబుతో పాటు పాదయాత్ర చేశారు. ఆమెతో పాటు ఆమె మిత్రులు 20 మంది కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. చంద్రబాబు బావమరిది నందమూరి రామకృష్ణ భార్య కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

భువనేశ్వరి తన కుమారుడు నారా లోకేష్, తన మిత్రులతో కలిసి ఆదివారంనాడు చంద్రబాబుతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో చెట్టు నీడన వారంతా కలిసి భోజనం చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తిన్నటువంటి ఆహారమే వారూ తిన్నారు.

చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మొదట్లో కొద్ది రోజులు తండ్రితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలివిడిగా మెలుగుతూ కనిపించారు. ఆయన పాదయాత్రలో ప్రత్యేకార్షణగా నిలిచారు.

పాదయాత్రతోనే కాకుండా గతంలో కూడా చంద్రబాబుకు భువనేశ్వరి చంద్రబాబు కార్యక్రమాలకు బాసటగా నిలిచారు. గతంలో చంద్రబాబు రైతుల కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా భువనేశ్వరి, నారా లోకేష్ దీక్షా శిబిరానికి వచ్చారు. చంద్రబాబుతో పాటు దీక్షలో పాల్గొన్నారు.

బావ మరిది నందమూరి బాలకృష్ణ చంద్రబాబు రాజకీయాలకు ఇమేజ్ ఇస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు పుంజుకోవడానికి ఆయన రాజకీయాల్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర ఉండగా ఆయన సంఘీభావం తెలపడానికి వచ్చారు.

పాదయాత్ర సందర్బంగా మరో బావ మరిది నందమూరి హరికృష్ణ చంద్రబాబుకు దగ్గరయ్యారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పాల్గొన్నారు. హిందూపురంలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభ ఏర్పాట్లను ఆయనే పర్యవేక్షించారు.

దూరంగా ఉంటూ వస్తున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాదయాత్ర సందర్భంగా చంద్రబాబును కలిశారు. మహబూబ్ నగర్ జిల్లాలో చంద్రబాబు గాయపడినప్పుడు ఆయన పరామర్శించడానికి వచ్చారు. తమ్ముడు కుమారుడు, హీరో నారా రోహిత్ కూడా చంద్రబాబును పరామర్శించారు.
పాదయాత్రలో తన భార్య భువనేశ్వరిపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. తనను క్రమశిక్షణలో ఉంచడంతో తన భార్య పాత్ర ఉందని ఆయన చెప్పారు. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నా కుటుంబాన్ని భువనేశ్వరి చక్కదిద్దిందని చెప్పుకున్నారు. కుటుంబం సాఫీగా సాగడానికి గల క్రెడిట్‌ను చంద్రబాబు భార్యకే ఇచ్చేశారు.
చంద్రబాబు వేదిక కూలడంతో స్వల్పంగా గాయపడినప్పుడు తన కుమారుడు లోకేష్‌తో కలిసి భువనేశ్వరి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబుకు దగ్గరుండి సేవలు చేశారు.












Click it and Unblock the Notifications