కుల వ్యూహంతో జగన్ దెబ్బ తింటారా?

తన వ్యూహంలో భాగంగా కాంగ్రెసు పార్టీ నాయకులు రెండు అంశాలను ముందుకు తెచ్చింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అసలు రెడ్డే కాదనేది అందులో ప్రధానమైన విషయం. ఆయన క్రైస్తవుడనే ప్రచారాన్ని కాంగ్రెసు పార్టీలోని జెసి దివాకర్ రెడ్డి, వీరశివా రెడ్డి వంటి నాయకులు ప్రచారం ప్రారంభించారు. రెడ్డి వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వైయస్ జగన్‌కు మద్దతు తెలుపుతుండడంతో ఆ ప్రచారాన్ని వారు ముందుకు తెచ్చారు. రెడ్డి వర్గాన్ని కూడగట్టడానికి వైయస్ జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే పద్ధతి ప్రకారం పనిచేశారనే అభిప్రాయం ఉంది.
రెడ్డి కాదని ప్రచారం చేస్తే దళితులు, బలహీన వర్గాలు ఆయన వెంట వెళ్తారనే భయం కాంగ్రెసు పార్టీ పట్టుకుంది. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దళిత క్రైస్తవ సామాజిక వర్గం మద్దతు కూడా వైయస్ జగన్‌కు దండిగానే ఉంది. దీంతో సీమాంధ్రలోని ఈ వర్గాన్ని కూడా వైయస్ జగన్‌కు దూరం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల దళితులకు ఏమీ ఒరగలేదనే ప్రచారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మంత్రి కొండ్రు మురళి నుంచి ప్రారంభమైంది.
కొండ్రు మురళి ప్రారంభించిన ప్రచారాన్ని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, హర్షకుమార్ వంటి నాయకులు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించడం వల్ల, వైయస్ వల్ల దళితులకు న్యాయం జరగలేదని చెప్పడం ద్వారా వైయస్ జగన్‌కు వారిని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రచారంలోకి తెచ్చి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వైయస్ జగన్ ప్రయత్నిస్తుండడంతో వైయస్ పథకాల వల్ల దళితులకు ప్రయోజనం చేకూరలేదని చెప్తే ఆ వర్గాలను జగన్‌కు దూరం చేయాలని అనుకుంటున్నారు.
ఈ స్థితిలో వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పూర్తిగా వదులుకోవడానికి కూడా కాంగ్రెసు పార్టీ సిద్ధంగా లేదు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి నాయకులే కాకుండా తాజాగా రాష్టానికి వచ్చిన సోనియా దూత వాయలార్ రవి వైయస్ రాజశేఖర రెడ్డి తమ నాయకుడేనని చెబుతున్నారు. అవినీతికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోందని, అందువల్ల వైయస్ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి వీలు లేదని అంటున్నారు. కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్‌ను దెబ్బ తీయడానికి అనుసరిస్తున్న వ్యూహం ఫలిస్తుందో, బెడిసి కొడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications