తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇక అడుగు దూరంలోనే ఉంది. గత సంవత్సరం డిసెంబర్ ఆరో తేదిన తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే నేను ఆదుకుంటానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. అప్పుడే పార్టీ అధిష్టానం చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రజారాజ్యం పార్టీ విలీనం, రాష్ట్రానికి చెందిన కొందరు ఎంపీలు చిరుకు కేంద్రమంత్రి పదవి వ్యతిరేకించడం తదితర కారణాల దృష్ట్యా పలువురిలో అనుమానాలు రేకెత్తాయి. రెండు రోజుల క్రితం కూడా చిరంజీవిని రాష్ట్రానికే పరిమితం చేసి, హోంశాఖను కట్టబెడతారనే ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కూడా చిరును కేంద్రానికి పంపించడం కంటే రాష్ట్రానికే పరిమితం చేస్తే పార్టీకి లాభం ఉంటుందని, తిరుపతి స్థానం ఖాళీ అయితే గెలవడం కష్టమని కూడా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికి తెరదించుతూ అధిష్టానం చిరంజీవిని ఖరారు చేసింది. కిరణ్ వర్గంలో ఇద్దరికి చోటు కల్పిస్తామన్న హామీని ఇప్పటికే అధిష్టానం నెరవేర్చింది. ఇక చిరంజీవికి కేంద్రమంత్రి పదవే మిగిలి ఉంది. ఇప్పుడు ఆయనను పెద్దల సభకు ఖరారు చేయడంతో త్వరలో ఆయనను కేబినెట్‌లోకి తీసుకునేందుకు రంగం సిద్ధమై పోయినట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఈ నెలాఖరున ప్రధాని మన్మోహన్ కేబినెట్‌లోకి నలుగురు కొత్తవాళ్లు చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారం, పది రోజుల్లోనే చిరు బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా సామాజిక వర్గాల పరంగా చూస్తే కొత్తగా అవకాశమిచ్చిన వారిలో కాపు, కమ్మ, రెడ్డి, బిసిలకు సీట్లు దక్కాయి. కాపు వర్గానికి చెందిన దాసరి నారాయణ స్థానంలో అదే వర్గానికి చెందిన చిరంజీవి, సంజీవ రెడ్డి స్థానంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, బిసి వర్గానికి చెందిన కేశవ రావు స్థానంలో రాపోలు ఆనంద భాస్కర్‌కు అవకాశం ఇచ్చారు. ఇక కాంగ్రెసులో కాపులకు ప్రధాన్యం పెరుగుతుందన్న విమర్శల నేపథ్యంలో రషీద్ అల్వీ స్థానంలో రేణుకా చౌదరికి చోటు కల్పించారు. కొత్తగా ఎంపికైన నలుగురిలో చిరంజీవి తప్ప మిగిలిన ముగ్గురూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే.