ఉప పోరులో గెలిస్తే జగన్ నిర్దోషి అవుతారా?

ఇప్పటి అంచనాల ప్రకారమైతే జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కనీసం 14 స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. భారీగా అక్రమ మార్గంలో వైయస్ జగన్ సంపదను కూడగట్టాడనే ఆరోపణపై సిబిఐ విచారణ జరుపుతోంది. అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాలు ఉంటే దర్యాప్తు సంస్థ పార్లమెంటు సభ్యుడిని గానీ రాజకీయ నాయకుడిని గానీ, అతను పాలక పక్షానికీ చెందనీ, ప్రతిపక్షానికి చెందనీ విచారణ జరగాల్సిందే. కోర్టుకు లాగాల్సిందే. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అనే నిబంధన కింద రాజకీయ నాయకులు కూడా దర్యాప్తులను, విచారణలను ఎదుర్కోవాల్సిందే.
వైయస్ జగన్ విషయంలో నిజానికి అదే జరుగుతోంది. కానీ, జగన్‌ను అరెస్టు చేసిన సమయం, యుపిఎ ప్రభుత్వంపై ఆయన తిరుగుబాటు కారణంగా వివాదం చెలరేగుతోంది. వైయస్ జగన్ సొంత పార్టీని స్థాపించి కాంగ్రెసుకు సవాల్ విసిరడం వల్లనే సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకుందనే అభిప్రాయం బలంగా ఉంది. అంత మాత్రాన వైయస్ జగన్ అరెస్టు చట్టబద్దంగా న్యాయమే అవుతుంది. కానీ, రాజకీయాలు వేరు, చట్టం వేరు అనే పద్ధతిలో వ్యవహారాలు నడుస్తున్నాయి.
నిజానికి, వైయస్ రాజశేఖర రెడ్డికి సంపూర్ణ స్వేచ్ఛను కాంగ్రెసు అధిష్టానం ప్రసాదించింది. వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహారాలు కాంగ్రెసు అధిష్టానానికి తెలియవని అనలేం. వైయస్ జగన్ మీడియా సంస్థలను స్థాపించడం, పెద్ద యెత్తున పెట్టుబడులను సమీకరించడం కూడా కాంగ్రెసు అధిష్టానానికి తెలియదని చెప్పలేం. సాక్షి ప్రారంభోత్సవానికి అప్పటి కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా హాజరయ్యారు. వైయస్ జీవించి ఉన్నంత వరకు పార్టీ అధిష్టానం మౌనంగా ఉండిపోయింది.
అంత మాత్రాన వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తును అన్యాయమని చెప్పలేమని నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయం. మొత్తంగా వైయస్ జగన్ రాజకీయ దూకుడును కట్టడి చేయడానికి కాంగ్రెసు అధిష్టానం చొరవతోనే సిబిఐ దర్యాప్తు జరుగుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. వైయస్ జగన్‌ను అరెస్టు చేసినప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు విజయావకాశాలు ఉప ఎన్నికల్లో తగ్గే అవకాశం లేదని అంటున్నారు. వైయస్ జగన్ అరెస్టు వల్ల వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచారంలోకి దిగిన నేపథ్యంలోని సానుభూతిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
దురదృష్టవశాత్తు, పైస్థాయిలోని అవినీతి ప్రజల్లో ఎజెండాగా మారలేదు. అవినీతిని దాదాపుగా ప్రజలు అంగీకరిస్తున్నారనే చెప్పాలి. ఈ స్థితిలో ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చు. అంత మాత్రాన వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిర్దోషి కాలేడు. తన నిర్దోషిత్వాన్ని ఆయన కోర్టుల్లో తేల్చుకోవాల్సిందే.












Click it and Unblock the Notifications