గాలి పార్టీలోకి రక్షిత: స్టార్లపై కన్నేసిన కన్నడ నేతలు

ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆయా పార్టీలలో చేరారు. రమ్య కాంగ్రెసులో, పూజా గాంధీ, మాళవిక జెడిఎస్ పార్టీలలో చేరారు. అయితే రక్షిత గాలి ప్రధాన అనుచరుడి పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. గనుల దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు స్థాపించిన పార్టీలో చేరి రక్షిత అందరినీ సర్ ప్రైజ్ చేసింది. తనకు సినిమాలు తగ్గడంతో ఆమె కన్నడ డైరెక్టర్ ప్రేంను పెళ్లి చేసుకొని నిర్మాతగా మారిపోయింది. తాజాగా శ్రీరాములు పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. కాగా కొత్తగా పార్టీ స్థాపించిన శ్రీరాములు తన పార్టీలోకి మరికొందరు సినీ స్టార్‌లను లాగే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. రక్షిత భర్త ప్రేం కూడా బిఎస్సార్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు పలు పార్టీల నుండి పిలుపు వచ్చిందని అయితే తన కుటుంబ సభ్యులను సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.