జగన్ పార్టీలోకి పిజెఆర్ కూతురు, ముహూర్తం

ఆదివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాదులోని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో వెళ్లి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారు. ఈ విషయాన్ని ఆమె శనివారం వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలో తన తండ్రి పిజెఆర్ చేసిన సేవలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని ఆమె చెప్పారు. పిజెఆర్ ఆశయాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, నియోజకవర్గంలో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందని ఆమె విమర్శించారు. పిజెఆర్ కుటుంబ సభ్యులు ఖైరతాబాద్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై కొంత కాలంగా తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని ఆమె అన్నారు. పిజెఆర్ ఆశయాలు నెరవేరాలంటే యువరక్తం నింపుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అసలైన వేదిక అని ఆమె అన్నారు.
ఇదిలా వుంటే, ఆమె సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి బంజారాహిల్స్ శాసనసభా నియోజకవర్గం నుంచి శానససభకు కాంగ్రెసు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయా రెడ్డి ఖైరతాబాద్ సీటును ఆశించారు. అయితే, అందుకు వైయస్ రాజశేఖర రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఖైరతాబాద్ సీటు ఇవ్వకుండా బంజారాహిల్స్ నియోజకవర్గానికి పంపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డితో పి. జనార్దన్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం పోరు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి వైఖరిని నిరంతరం తప్పు పడుతూ వచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి. జనార్దన్ రెడ్డికి ఎనలేని అభిమాన సంపద ఉంది. ఆయన పేద ప్రజల అభిమానాన్ని పొందారు. ఇప్పుడు విజయా రెడ్డి జగన్ పార్టీలో చేరడాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాల్సిందే.