అదిగో పులి: తెలంగాణపై కాంగ్రెసు తేలుస్తోందా?

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణపై తేల్చడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధమైనట్లు మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 9వ తేదీలోగా తెలంగాణ సమస్యపై స్పష్టత ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం చూస్తోందంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వివాదంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వివాదంతోపాటు లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లీస్, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవటం గురించి కూడా చర్చిస్తారని అంటున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఏకె ఆంటోని, ఆర్థిక మంత్రి పి చిదంబరం, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతోపాటు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ప్రత్యేక పరిశీలకుడు వాయలార్ రవి హాజరవుతారని చెబుతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించటంతో పాటు, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల అభివృద్ధికి మూడు అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మర్రి శశిధర్ రెడ్డి లేదా మరో నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించే పక్షంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి రఘువీరా రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అంటున్నారు. పిసిసి ప్రస్తుత అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అదే పదవిలో కొనసాగించే పక్షంలో మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుందని అంటున్నారు. తెలంగాణ ప్రాంతీయ మండలి నేతృత్వాన్ని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు గానీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు గానీ అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ వ్యవహారంపై ఈ ప్రాంతానికి చెందిన పలువురు సీనియర్ల అభిప్రాయాలను ఇటీవల సేకరించింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం మేరకు రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి, మరికొందరు సీనియర్ నేతలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌తోపాటు, ఇతర పార్టీల సీనియర్లతో విడివిడిగా మాట్లాడారు. ఆయా నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వారు హైకమాండ్‌కు వివరించారు. కోర్ కమిటీలో వీటన్నింటినీ పరిశీలించవచ్చునని అంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వ్యవహారంపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ఆజాద్ గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్ర విభజనపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆజాద్ స్పష్టం చేశారు. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అసదుద్దీన్ ఒవైసీ వైయస్సార్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డితో సీట్ల సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తల గురించి అడిగిన ప్రశ్నలకు ఆజాద్ బదులివ్వకుండా దాటవేశారు. మొత్తం మీద, రాష్ట్రానికి చెందిన సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెసు అధిష్టానం దృష్టి సారిస్తున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+