బైపోల్స్‌పై రికార్డ్ స్థాయిలో బెట్టింగ్స్, కొత్త ట్రెండ్

పోలింగ్ భారీగా జరగడంతో బెట్టింగులు కూడా అదే స్థాయిలో జోరందుకున్నాయని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పదిహేను సీట్లు ఆ పైన వస్తాయని కొందరు, అంతకంటే తక్కువే వస్తాయని మరికొందరు బెట్టింగులు కట్టారట. జగన్ పార్టీకి 16 స్థానాలకు పైగానే వస్తాయని బెట్టింగ్ రాయుళ్లు ప్రధానంగా పందేలు కాశారట. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుస్తుందనే అంశంతో పాటు ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది.. ఏ అభ్యర్థి రెండో స్థానంలో ఉంటారు... ఏ అభ్యర్థి మూడోస్థానంలో ఉంటారనే అంశంపై బెట్టింగులు జరిగాయట.
మరో విషయమేమంటే బెట్టింగ్ రాయుళ్లు ఈసారి కొత్త ట్రెండ్‌కు తెరతీశారని అంటున్నారు. గతంలో ప్రచార సాధనాలు, పలు సంస్థలు పోటీలో ఉన్న పార్టీలు, అభ్యర్థులు సర్వేలు చేసేవారు. అయితే ఈ ఉప ఎన్నికలకు బెట్టింగ్ రాయుళ్లు కూడా సర్వేలు చేశారట. ఒక్కో నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారనే విషయంపై ప్రత్యేకంగా సర్వేలు జరిపించారట. ఆయా నియోజకవర్గాలలో తమకు ఉన్న బంధువులు, స్నేహితులే కాకుండా పలువురి ఫోన్ నెంబర్లు తీసుకొని ఏ పార్టీ గెలవబోతుందని ఆరా తీశారట.
ఆ మేరకు అన్నింటిని కంపేర్ చేసుకొని బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాశారట, ఇంకా కాస్తున్నారట. ఇంకో విశేషమేమంటే రాజకీయ పార్టీ నేతలు కూడా గెలుపోటములు, మెజార్టీపై పందేలు కాస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలలో ఆయా పార్టీల అభ్యర్థులు మొత్తం కలిపి రూ.700 కోట్లను ఖర్చు పెట్టారని అంచనా వేస్తున్నారు. అయితే బెట్టింగులు మాత్రం రూ.వెయ్యికోట్ల మార్క్‌ను దాటాయని అంటున్నారు.
బెట్టింగ్ రాయుళ్లు తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైనే ఎక్కువగా పందేలు కాశారట. కొన్ని స్థానాలలో తెలుగుదేశం, కాంగ్రెసు గెలుపు పైనా కాశారట. అయితే కాంగ్రెసు, టిడిపి విషయంలో తక్కువ మెజార్టీకి కాస్తున్నారట. బెట్టింగ్ రాయుళ్లు పరకాల నియోజకవర్గంపై తొలుత భారతీయ జనతా పార్టీ గెలుపుపై జోరుగా పందాలు కాసినప్పటికీ ఓటింగ్ సరళి తర్వాత తెరాస వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అంతేకాదు కొండా సురేఖ గెలుపుపై కూడా జోరుగానే పందేలు కట్టారని అంటున్నారు.












Click it and Unblock the Notifications