షర్మిలకు బ్రేక్: వైయస్ విజయమ్మ బస్సు యాత్ర?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను కొనసాగిస్తున్న నేపథ్యంలో దానికి దీటుగా మరో కార్యక్రమం చేపట్టాలనే యోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ విజయమ్మ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. వైయస్ విజయమ్మ బస్సు యాత్ర విషయంపై పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో చర్చించినట్లు చెబుతున్నారు.
జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు శుక్రవారం వైయస్ జగన్‌ను హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో కలిశారు. ఈ సందర్భంగా వైయస్ విజయమ్మ బస్సు యాత్ర చేపట్టే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వైయస్ జగన్ అనుమతితో వైయస్ విజయమ్మ బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి పార్టీ ప్రతినిధులుగా ఎవరిని పంపించాలనే విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అఖిల పక్ష సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై, ప్రతినిధుల పేర్లపై పార్టీ నాయకులు వైయస్ జగన్‌ను సంప్రదించే అవకాశం ఉంది.
తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తాము తెలంగాణకు అనుకూలమని చెప్పడానికి కూడా సిద్ధంగా లేదు. దాంతో కర్ర విరగకుండా పాము చావకుండా ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కత్తి మీద సాము వంటిదే.












Click it and Unblock the Notifications