తెలంగాణ నోట్: 12 స్టెప్పులు, ఏడున్నర నెలలు

కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడానికి శాసనసభ తీర్మానం నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు కనీసం ఏడున్నర నెలలు పడుతుందని అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకున్న తర్వాత శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని కోరవచ్చునని అంటున్నారు. శానససభ తీర్మానం చేస్తే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై ముగియడానికి 12 దశలను, ఒక్కో దశ పూర్తి కావడానికి అవసరమైన సమయాన్ని తెలియజేస్తూ 17 పేజీల నోట్‌ను కోర్ కమిటీ సమావేశంలో ఇచ్చారు.
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడినట్లే అర్థమవుతోంది. అయితే, హైదరాబాదు విషయమే ఇంకా తేల్చాల్సి ఉందని అంటున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేసినట్లు చెబుతున్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారు. నిజానికి, హైదరాబాదును తెలంగాణకు ఇవ్వకపోతే విభజనకు సీమాంధ్ర నాయకుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు కూడా ఉండవు. ఇదే విషయంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు.
హైదరాబాదు తెలంగాణకు మధ్యలో ఉండడం వల్ల హాంకాంగ్ లాంటి హోదాను కల్పించడం సాధ్యం కాదని జైపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని తెలంగాణ నాయకులు పట్టుబడుతున్నారు. అయితే, పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా అంగీకరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ, సీమాంధ్ర ప్రాంతానికి ఏ మాత్రం సమీపంగా లేని హైదరాబాద్‌లో ఆ ప్రాంతం రాజధానిని పెట్టుకుని కార్యకలాపాలు నడపడం వారికి సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు.
మొత్తం మీద, రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికి పది రోజుల్లో సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు కావచ్చునని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటూ దేశంలోని ఇతర డిమాండ్లపై అధ్యయనానికి రెండో ఎస్సార్సీని వేయాలని సిడిబ్ల్యుసి అంగీకరించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications