చిరు, జగన్, ఎన్టీఆర్: ముక్కలు చెక్కలు(పిక్చర్స్)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ఐదారు వర్గాలుగా విడిపోయిందట. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డి, కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తదితరులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో పార్టీ ముక్కలు చెక్కలు అయిందని అధినేత్రికి చెప్పారట. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదారు గ్రూపులు ఉన్నాయని, ఇది వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుస్తుందని వారు అధినేత్రి దృష్టికి తీసుకు వెళ్లారట. వీటిని సెట్ చేస్తే తప్పితే కాంగ్రెసు పార్టీ గట్టెక్కే అవకాశాలు లేవని వారు సోనియా చెవిలో వేశారట.
ప్రస్తుతం కాంగ్రెసులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి వర్గం, తెలంగాణ నేతల వర్గం, కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, ఆయన వైరి వర్గం, వైయస్ రాజశేఖర రెడ్డి వర్గం ఉందని వారు సోనియాకు చెప్పినట్లుగా సమాచారం. వారి ఆవేదనను విన్న సోనియా తాను త్వరలో రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారిస్తానని, అన్నింటిని సెట్ చేస్తానని హామీ ఇచ్చారట.

రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఐదారు వర్గాలుగా విడిపోయిందని పలువురు ఎంపీలు సోనియా గాంధీకి చెప్పి.. రాష్ట్ర కాంగ్రెసును సెట్ చేయాలని సూచించారట.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత.. చిరంజీవి వర్గం పలుమార్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల ఆ వర్గం దూకుడు పెంచింది. చిరంజీవినే 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసే పనిని భుజాన వేసుకున్నారు. సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావుతో పాటు పలువురు కాంగ్రెసు నేతలు కూడా చిరుకు అనుకూలంగా ఉన్నారు.

దగ్గుపాటి పురంధేశ్వరి వర్గం ఎన్టీఆర్ కాంగ్రెసును తెరపైకి తీసుకు వస్తుందని సోనియాకు చెప్పారట. ఎన్టీఆర్ కాంగ్రెసును వ్యతిరేకించిన వ్యక్తి అని, ఆమె కూతురు పురంధేశ్వరి కాంగ్రెసులో తన వర్గాన్ని ప్రోత్సహిస్తోందని, ఇది ఎన్టీఆర్ వర్గంగా ఉందని వారు చెప్పారని సమాచారం.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమంటూ పార్టీని ఇరు ప్రాంతాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారట.

ఆధిపత్య పోరులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, ఆయన వ్యతిరేక వర్గంగా చీలిపోయారని, ఎవరికి వారు ఒకరిపై మరొకరు పరోక్ష విమర్శలు, విసుర్లు విసురుకుంటూ నిత్యం మీడియాకెక్కుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించే నేతలు, ఆయనకు అనుకూలంగా ఉన్న నేతలతోను ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు సోనియాకు ఫిర్యాదు చేశారట. వైయస్ పైన కొందరు విమర్శలు గుప్పిస్తుంటే.. వారి ఆరోపణలతో మరికొందరు విభేదించడం కాంగ్రెసు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందని సూచించారట. అలాగే మరికొందరు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు ఉన్నారని ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications