డబ్బింగ్: దాసరి చిరంజీవిని టార్గెట్ చేశారా?

తెలుగు టెలివిజన్ కళాకారుల ఉద్యమం ఉధృతం కాకముందే టీవీ యాజమాన్యాలు చర్చలకు ముందుకు రావాలని దర్శక నిర్మాత దాసరి నారాయణరావు సూచించారు. తెలుగు టీవీ చానళ్లలో డబ్బింగ్ సీరియల్స్ నిషేధించాలన్న డిమాండ్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇందిరాపార్కువద్ద చేపట్టిన రిలేనిరాహార దీక్షలు బుధవారానికి 30వ రోజుకు చేరాయి. మేడే సందర్భంగా కళాకారులు బుధవారం మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు దర్శక నిర్మాత దాసరి నారాయణరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ డబ్బింగ్ సీరియల్స్ ఆపేయని టీవీ చానెళ్లపై విమర్శలు చేశారు. డబ్బింగ్ సీరియల్స్ భాషా సంస్కృతికే కాకుండా నిరుద్యోగ అంశంతో ముడిపడి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
మాటీవీపై ఇటీవల దాడి జరిగినప్పుడు నిర్మాత, చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనక ఎవరున్నారో తమకు తెలుసునని ఆయన అన్నారు. డబ్బింగ్ సీరియల్స్ ప్రసారాన్ని విడతలవారీగా ఆపేస్తామని, ఒకేసారి ఆపేస్తే నష్టాలు వస్తాయని ఆయన అన్నారు. మొత్తం మీద, సమస్య పక్కకు వెళ్లి చిరంజీవికి, దాసరి నారాయణరావుకు మధ్య విభేదాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications