గన్నవరం ట్విస్ట్: బరిలో హరికృష్ణ, ఎన్టీఆర్ డైలమా?

క్రియాశీల రాజకీయాలలో ఇకపై దూకుడుగా వ్యవహరించాలని నందమూరి హరికృష్ణ గట్టిగా భావిస్తున్నారట. దీనికి కృష్ణా జిల్లానే కేంద్రంగా చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట. గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని హరికృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గన్నవరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై తన ఆంతరంగికుల ద్వారా హరికృష్ణ ఆరా తీస్తున్నారట. తన సోదరుడు, హీరో నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ కూడా కొద్దికాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
బాలయ్య పెనమలూరు నుండి పోటీ చేస్తారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. తాజాగా హరికృష్ణ గన్నవరంపై కన్నేయడం విశేషం. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం దాసరి బాలవర్థనరావు ఉన్నారు. ఆయన మూడు దఫాలుగా గన్నవరం స్థానం నుంచి పోటీ చేయగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి గన్నవరం స్థానం నుంచి బాలవర్థన రావు పోటీ చేస్తారా? వల్లభనేని వంశీకి కేటాయిస్తారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.
బాలవర్థన రావుకు గన్నవరం సీటు ఇవ్వటానికి మొదట్లో గద్దె రామ్మోహన రావుకు విజయవాడ ఎంపీ సీటు ఇచ్చారు. ఆయన గెలిచారు. ఆ తర్వాత 2009లో వల్లభనేని వంశీ పోటీకి రావటంతో ఆయనను కూడా ఆ ఎన్నికలలో విజయవాడ ఎంపీగా పోటీ చేయించారు. గద్దె రామ్మోహన్ రావును విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయించారు. తాజాగా ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, కేశినేని నానిని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. వంశీని తప్పించారు.
అర్బన్ టిడిపి నూతన అధ్యక్షుడిగా నాగుల్ మీరాకు అవకాశమిచ్చారు. దీంతో అటు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగాను, ఇటు అర్బన్ టిడిపి అధ్యక్షుడి పదవులను వంశీ కోల్పోవాల్సి వచ్చింది. గన్నవరం సీటు ఇచ్చే హామీ మీద వంశీని తప్పించారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వంశీకి ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన గద్దె కూడా ఇదే సమయంలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబును కలిసి విజయవాడ ఎంపీ సీటు కావాలని కోరారు.
ఎంపీ సీటు విషయమై చంద్రబాబు హామీ అయితే ఇవ్వలేదు కానీ, గన్నవరం, నూజివీడు స్థానాలలో ఏదో ఒకటి ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కొత్తగా హరికృష్ణ గన్నవరం నుంచి పోటీ చేయటానికి ఆరా తీయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలున్న ఫ్లెక్సీలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు షర్మిల పాదయాత్రలో ప్రదర్శించటం, దానిపై టిడిపిలో వివాదాలు చోటుచేసుకోవడం తెలిసిందే.
తన ఫొటోలను జగన్ పార్టీ నేతలు వాడడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించాలని, లేనిపక్షంలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో బాలకృష్ణ హెచ్చరించారు. ఆ తరువాత హరికృష్ణ తన సోదరుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ పరిస్థితులలో హరికృష్ణ గన్నవరం నుంచి పోటీ చేయనున్నట్టు జరుగుతున్న ప్రచారం జిల్లాలో ఆసక్తిని కలిగిస్తోంది.
అంతేకాకుండా తనకు అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీ గన్నవరం నుంచి రంగంలో ఉండటంతో, ఆ స్థానం నుంచి తన తండ్రి పోటీ చేయటానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరిస్తారా? లేదా? అన్నదానిపై కూడా చర్చ నడుస్తోంది. అలాకాకుండా వల్లభనేని వంశీకి ఇవ్వని పక్షంలో హరికృష్ణకు ఇచ్చే విధంగా జూనియర్ ఎన్టీఆర్ పావులు కదుపుతున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. వంశీకి గన్నవరం టిక్కెట్ ఇవ్వకుండా దాసరికే ఇస్తే హరికృష్ణను బరిలోకి దింపితే వారు తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications