యూటి, తెలంగాణ: హైదరాబాద్‌పై మళ్లీ డైలమా?

మరో రెండు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. ఇదే క్రమంలో ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి మరో విడత చర్చలు మొదలుపెట్టింది. సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. కేబినెట్ నోట్ సిద్ధమవుతోందని, ఇరవై రోజుల్లో మంత్రివర్గం ముందుకు వస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రెండు రోజుల క్రితం ప్రకటంచారు. అయితే, హైదరాబాద్ హోదా తేలిన తర్వాతే నోట్‌కు సమగ్రత వస్తుందని మరికొందరు అంటున్నారు.
విభజన ప్రక్రియలో నీళ్లు, హైదరాబాదులు ప్రధాన అంశాలుగా మారాయి. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, శాశ్వత రాజధానిని చేయాలని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చండీగఢ్ తరహాలో హైదరాబాద్‌ను సీమాంధ్ర, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.
సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, పార్లమెంటులో ఆ ప్రాంత సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ దిశగా యోచిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై నిర్ణయం మాత్రం జరగలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే అక్కడ తమ ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని సీమాంధ్రలో అత్యధికులు భావిస్తున్నారని అందువల్లే, ఈ డిమాండ్ పైన ఆలోచన చేస్తోందట.
మరోవైపు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశమున్నప్పటికీ అది పదేళ్లు మాత్రమే ఉంటుందని, హైదరాబాదు రెండు రాష్ట్రాల రాజధానిగా కూడా పదేళ్లు మాత్రమే ఉంటుందని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, తొలుత చండీగఢ్‌ను కూడా పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. అదే సమయంలో హైదరాబాదు పరిధి పైన కూడా చర్యలు సాగుతున్నాయట. గ్రేటర్ హైదరాబాదా లేక హెచ్ఎండిఏను చేర్చాలా అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారట.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం గురించి తానేమీ చెప్పలేనని ఎపి కాంగ్రెసు వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పగా, తెలంగాణ ప్రాంత నేతలు మాత్రం రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొడుతున్నారు.












Click it and Unblock the Notifications