చూసి చెబుతున్నారు!: బాబు స్పీచ్‌లో మార్పు
విభజన నిర్ణయం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాను చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపించింది. చంద్రబాబు గతంలో చెప్పదల్చుకున్నది చెప్పేసి వెళ్లేవారు. ఇప్పుడు హావభావాలు ప్రదర్శిస్తూ, ప్రజా స్పందనను గమనిస్తూ మాట్లాడుతున్నారు.
ఏం తమ్ముళ్లూ నిజమేనా అంటూ ఆయన పదే పదే ప్రజలను ప్రశ్నించి స్పందన చూశారు. మాటల్లో కూడా భావోద్వేగాన్ని కల్గించే ఘాటు కన్పించింది. ఆయన మాట్లాడిన పలు వ్యాఖ్యలు కార్యకర్తలను ఆకర్షించాయి. నాడు ఎన్టీఆర్ కాంగ్రెసు పార్టీని వణికించారని, ఇప్పుడు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని, రాహుల్ గాంధీ కోసం రాష్ట్రాన్ని ఏదో చేయాలని చూస్తున్నారని, అలాగే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెరాస పైన విమర్శలు చేసినప్పుడు స్పందన కనిపించింది.

మాట్లాడేటప్పుడు అన్నివైపులా తిరిగి అందర్ని గమనిస్తూ, ఉత్తేజపరుస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. దాచేపల్లిలో ప్రసంగాన్ని ప్రారంభించిన బాబు ఇది దాచేపల్లి కాదు తెలుగువారి అభిమానాన్ని దోచేపల్లి అంటూ ఆకట్టుకున్నారు. ఆత్మగౌరవ యాత్రకు ఇది తగిన సమయంకాదని సీనియర్ నేతలు సైతం హెచ్చరించిన సమయంలో పొందుగలలో ప్రారంభమైన యాత్రకు అనూహ్య స్పందన లభించింది.
కాగా, గతంలో పలుమార్లు చంద్రబాబు పల్నాడుకు వచ్చినప్పటికీ రాని స్పందన ఆత్మగౌరవ యాత్రలో కనిపించిందని తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు యాత్రకు ఎక్కువగా తరలిరావటం కన్పించిందంటున్నారు.












Click it and Unblock the Notifications