కాంగ్రెసు, బిజెపి: కెసిఆర్ ఆధిపత్యానికి గండి?

బిజెపి ఇది వరకే ఆ పని ప్రారంభించగా, తెలంగాణ సాధన సభతో కాంగ్రెసు ఆ పనిని మొదలు పెట్టింది. ఆదివారంనాడు తెలంగాణ నాయకులు నిర్వహించిన తెలంగాణ సభ విజయవంతమైనట్లే. దాంతో తెలంగాణ అంశం మీద ముందుకు సాగితే తమకు ఢోకా ఉండదనే అభిప్రాయానికి తెలంగాణ కాంగ్రెసు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, బిజెపి జూలై 28వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హైదరాబాదు రప్పిస్తోంది. మోడీ తెలంగాణకు మద్దతుగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనేది జాతీయ పార్టీలతో మాత్రమే సాధ్యమవుతుందని బిజెపి ఇది వరకే చెబతూ వస్తోంది. ఇప్పుడు అదే నినాదాన్ని కాంగ్రెసు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తెరాస వంటి ఉప ప్రాంతీయ పార్టీలో అది సాధ్యం కాదని ఆ పార్టీలు చెప్పదలుచుకున్నాయి. దీంతో తెరాస ఆధిపత్యాన్ని దెబ్బ తీయాలనే ప్రయత్నాల్లో ఆ పార్టీలు ఉన్నాయి. దీంతో తెరాస వర్గాల్లో కలవరం ప్రారంభమైనట్లు చెబుతున్నారు.
తెలంగాణ నినాదంతో ముందుకు సాగడానికి కాంగ్రెసు తెలంగాణ నేతలు మొదటిసారి ఐక్యతను ప్రదర్శించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మొదలుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులైన మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి వంటివారు కూడా సభలో తెలంగాణ నినాదం వినిపించారు.
అయితే, తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీకి ఓ సమస్య ఉంది. తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసినా, తెలంగాణ ప్యాకేజీ ఇచ్చినా తెలంగాణ ప్రజలు కాగ్రెసు పార్టీకి అనుకూలంగా మారే సూచనలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించే స్థితిలో లేరు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం సీమాంధ్ర నాయకుల వ్యతిరేకతను కాదని తెలంగాణ ఇస్తుందా అనేది ప్రశ్న. అయితే, అందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధపడి ఉనట్లు చెబుతున్నారు.
రాయల తెలంగాణ కూడా ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది. అయితే, తెలంగాణపై ప్రకటన చేయడానికి తగిన సమయం కోసం సోనియా గాంధీ నిరీక్షిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) ముందు దాన్ని పెట్టి, ఆ తర్వాత మంత్రి వర్గం ఆమోదం పొంది, పార్లమెంటులో ప్రకటన చేయించాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, చివరి నిమిషంలో ఏం జరుగుతందనేది ఏమీ చెప్పలేని స్థితి.
కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తే తెరాసను ఆ పార్టీలో విలీనం చేయడమో, ఎన్నికలకు ముందు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమో చేసే అవకాశాలుంటాయని అంటున్నారు. ఏమైనా, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ప్రతివ్యూహం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications