విభజన: కోర్ కమిటీ పెద్దల మాటేంటి!?(పిక్చర్స్)
కాంగ్రెసు పార్టీలో తెలంగాణపై నిర్ణయం తీసుకునేది కోర్ కమిటీ సభ్యులే! శుక్రవారం కోర్ కమిటీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో భేటీ అవుతుంది. ఈ భేటీలో సిడబ్ల్యూసిలో తెలంగాణపై తీసుకునే నిర్ణయంపై చర్చిస్తారు.
కోర్ కమిటీ భేటీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు ఆంటోనీ, చిదంబరం, ఎకో ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ ఉన్నారు.
కోర్ కమిటీ భేటీకి ముందు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలతో అధిష్టానం చర్చించనుంది. కోర్ కమిటిలో భేటీకి వారికి ఆహ్వావం అందినట్లుగా సమాచారం.
ఇప్పటికే అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసేసుకుందని, రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోందని, ఎలా ప్రకటన చేయాలన్నదే ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్ కమిటీలో తెలంగాణకు అనుకూలంగా... విముఖంగా.. ఉన్న నేతలు...!

సోనియా గాంధీ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదటి నుండి తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లినప్పుడు, 2009 ఎన్నికల్లోను తెలంగాణ ప్రజల మనసు తెలుసునని, దానిని నెరవేర్చుతామని చెప్పారు. ఆ తర్వాత 2009 డిసెంబర్ 9న సోనియా తన పుట్టిన రోజు నాడు తెలంగాణపై ప్రకటన వెలువడింది. సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని పక్కన పెట్టారు. ఇప్పటికీ ఆమె తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు.

మన్మోహన్ సింగ్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలంగాణ ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారని సమాచారం. అయితే ఇలాంటి రాజకీయ నిర్ణయాల్లో ఆయన జోక్యం అంతగా ఉండదనే వాదన ఉంది. సోనియా గాంధీ నిర్ణయానికి మన్మోహన్ కట్టుబడి ఉంటారు. తెలంగాణ బదులు ప్యాకేజీ ఇవ్వాలని ఆయన ఎప్పుడో భావించారు. కానీ, పరిస్థితులు మారిపోవడంతో రాష్ట్ర విభజన తెర ముందుకు వచ్చింది.

చిదంబరం
ఆర్థిక మంత్రి చిదంబరం మొదటి నుంచి చిన్న రాష్ట్రాలను సమర్థిస్తూ వస్తున్నారు. సెంటిమెంట్ మరింత బలంగా తయారు కావడంతో తెలంగాణ ఏర్పాటు చేయక తప్పదని ఆయన బలంగానే వాదిస్తున్నారు. "ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. కానీ, కాంగ్రెస్ పార్టీయే తన నిర్ణయం చెప్పలేదు. మీరు పార్టీని ఒప్పించండి. తెలంగాణ ఇచ్చే బాధ్యత నాది'' అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో చిదంబరం ఎప్పుడో చెప్పారు.

అహ్మద్ పటేల్
సోనియాకు అహ్మద్ పటేల్ రాజకీయ సలహాదారు. రాజకీయ సంక్షోభాలను నివారించడంలో, ప్రత్యర్థులను అదుపులో పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. 2008లోనూ, 2009లోనూ తెలంగాణ ఏర్పాటు చేయక తప్పదని కోర్ కమిటీలో బలంగా వాదించింది అహ్మద్ పటేలేనని ప్రధానమంత్రి అప్పటి మీడియా సలహాదారు సంజయ్ బారూ ఒక సందర్భంలో చెప్పారు.

ఎకె ఆంటోనీ
సోనియా నిర్ణయించారంటే ఆంటోనీ వ్యతిరేకించరు! అయినా తెలంగాణ ఇస్తే శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు వస్తాయని ఆయన మిలటరీ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుని సోనియాకు ఇచ్చారు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా, రాజకీయంగా తమకు ప్రయోజనం జరుగుతుందని సోనియా భావిస్తే ఆయన వ్యతిరేకించకుండా ఉండిపోతారు. ఇటీవలి కాలంలో ఆయన కూడా తెలంగాణవైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. కానీ, ఆంటోనీ తీవ్రంగా వ్యతిరేకిస్తారని నమ్మేవారిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

సుశీల్ కుమార్ షిండే
హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణకు అంత సుముఖంగా లేరు. షిండే హోంమంత్రి అయిన తర్వాతే ప్యాకేజీ అంశం ముందుకు వచ్చింది. తెలంగాణ ఏర్పాటు చేస్తే విదర్భలో తనకు సమస్యలు వస్తాయని ఆయన బలంగా వాదించారు. కానీ, అధిష్టానానికి కట్టుబడి ఉంటారు.

గులాం నబీ ఆజాద్
ఏ రాష్ట్రానికి సారథ్యం వహించినా ఆ రాష్ట్రంలో పార్టీని గట్టెక్కించగల నేతగా ఆజాద్ గుర్తింపు పొందారు. అత్యంత క్లిష్ట సమయంలో రాష్ట్ర బాధ్యతలను చేపట్టిన ఆజాద్ తెలంగాణ, జగన్ అంశాలను పరిష్కరించకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడదని తాను ఇన్‌చార్జి అయిన నెలలోనే అధిష్ఠానానికి సలహా ఇచ్చారు. ఆయన ఫార్ములాకు అనుగుణంగానే తెలంగాణకు అనుకూలంగా పావులు కదులుతున్నాయి.

దిగ్విజయ్ సింగ్
దిగ్విజయ్ సింగ్ తెలంగాణను వ్యతిరేకించారు. అయితే ఇటీవల ఆయనలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయన బాధ్యతలు చేపట్టే నాటికే ఆజాద్ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇచ్చి వెళ్లారు. దాన్ని అమలు చేసే బాధ్యతను దిగ్విజయ్‌కు అధిష్ఠానం అప్పగించింది.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ విభజనను వ్యతిరేకిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తల్లి సోనియా గాంధీ మాటను ఆయన జవదాటరు. తెలంగాణపై తాను నివేదికలు తెప్పించుకున్న తర్వాతే సోనియా అభిప్రాయంతో ఏకీభవించడం మొదలు పెట్టారని అంటారు. ఇటీవల కోర్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీపై ఎటువంటి ప్రభావం పడుతుందంటూ కిరణ్, బొత్స, దామోదరలను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications