రాజీనామాపై 'లీకు వీరుడు' కిరణ్ రెడ్డి డైలమా?

కోర్ కమిటీ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా వాదించారు. దాదాపు గంటపాటు ఇచ్చిన పవర్ ప్రజంటేషన్‌లో తనకు వాదనను సమర్థించుకోవడానికి పలు కారణాలు చూపించారు. తెలంగాణ ఏర్పడితే తిరిగి మావోయిస్టులు విజృంభిస్తారని ఆయన చెప్పారు. బిజెపి, మజ్లీస్ బలం పుంజుకుంటాయని, దాని వల్ల మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని వాదించారు. ఈ విషయాలన్నీ మీడియాకు లీకు అయ్యాయి. ముఖ్యమంత్రి పనిగట్టుకుని ఎంపిక చేసిన మీడియాకు ఆ విషయాలను వెల్లడించారనే ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడితే గోదావరి, కృష్ణా నదీ జలాల వివాదాలు పెచ్చరిల్లుతాయని కూడా ఆయన కోర్ గ్రూప్ సమావేశంలో చెప్పారు. తాను హైదరాబాదులో జన్మించానని అంటూనే ఆయన సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నానని చెబుతూనే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆ మాటల మీద కిరణ్ కుమార్ రెడ్డి నిలబడుతారా, లేదా అనేది సందేహంగానే ఉందని చెబుతున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం పట్ల, కోర్ కమిటీ వివరాలను లీకు చేయడం పల్ల అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
అయినా, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా, కొనసాగుతారా అనే విషయాన్ని ప్రస్తుతం పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని అంటున్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించాల్సిన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నారు. ఆ సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన పాత్రపై కూడా అధిష్టానానికి స్పష్టత ఉందని అంటున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకునే అధిష్టానం రాష్ట్ర విభజన విషయంలో ముందడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తే దాంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని, అందువల్ల ఆయన అ పనిచేయబోరనే మాట ఓ వైపు వినిపిస్తుండగా, ఆయన రాజీనామా చేస్తారని మరో వైపు మరో వాదన వినిపిస్తుంది. ఏమైనా, ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది పూర్తిగా ముఖ్యమంత్రి చేతుల్లోంచి జారిపోయినట్లే చెప్పాలి.












Click it and Unblock the Notifications