అమిత్ షా చేతుల్లోనే: జగన్ కొర్రీ... కెసిఆర్, బాబు ఒక్కటవుతారా?
చంద్రబాబు నాయుడు, కెసిఆర్ భవిష్యత్తు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేతుల్లోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అసమ్మతిని, తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి ఇరువురు ముఖ్యమంత్రులకు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భవిష్యత్తు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేతుల్లోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అసమ్మతిని, తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి ఇరువురు ముఖ్యమంత్రులకు కూడా శాసనసభా స్థానాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
శాసనసభా స్థానాలను పెంచాలని వారు చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వం చేసే పని అయినప్పటికీ తుది నిర్ణయం మాత్రం అమిత్ షా మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. సీట్లు పెరుగుతాయి, వచ్చే ఎన్నికల్లో సర్దుబాట్లు చేస్తానని దీర్ఘ కాలికంగా టిడిపిలో ఉన్న నాయకులకు హామీ ఇచ్చి చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు.
చంద్రబాబు కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సీట్ల పెంపు కోసం వెంకయ్య నాయుడు పాటు పడుతూ వచ్చారు. కానీ, ఆయన ఉప రాష్ట్రపతిగా వెళ్తున్నారు. దీంతో వెంకయ్య మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సీట్ల పెంపు కెసిఆర్‌కు కూడా అవసరమే అయినప్పటికీ ఎక్కువగా చంద్రబాబుకు అవసరం.

ఒత్తిడి తెస్తున్నాయి....
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన అసెంబ్లీ సీట్ల పెంపు హామీని అమలు చేస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఏం చేస్తారనే ఆతురతతో కెసిఆర్, చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. (kcr, chandrababu)
Recommended Video


సుజనా చౌదరి ఇలా...
అమిత్ భాయ్ ఇషారా ఇస్తే సీట్ల పెంపు బిల్లు ఈ సమావేశాల్లోనే వస్తుందని, బిల్లు వారంలో వస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అమిత్‌షాతో 24న భేటీ అవుతున్నామని, ఒప్పించి బిల్లు పెట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 25న కొత్త రాష్ట్రపతిగా రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి కెసిఆర్, చంద్రబాబు వెళ్తున్నారు. ఆ సమయంలో వారిద్దరు ప్రధాని మోడీని కలుస్తారని అంటున్నారు.

చంద్రబాబు పర్యటన ఖరారు....
చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. అయితే కేసీఆర్ పర్యటన మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు. ఆయన 25న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని, ఈసారి మోడీని, అమిత్ షాను కలుస్తారని అంటున్నారు. ఈ లోగానే అమిత్ షా, అరుణ్ జైట్లీను కలిసి అవసరమైన ముందస్తు ఏర్పాటు చేయాలని సుజనా చౌదరి, సిఎం రమేష్ ప్రయత్నిస్తున్నారు.వారితో 24న భేటీ కానున్నారు.

వాయిదా పడింది..
అమిత్ షాతో సుజనా, రమేష్‌ల భేటీ శుక్రవారమే జరగాల్సి ఉండింది. అయితే చైనా సరిహద్దు సమస్యపై వరుసగా సమావేశాలు ఉండడంతో అమిత్‌షా భేటీని సోమవారానికి వాయిదా వేశారు. సీట్ల పెంపుపై అమిత్‌షాతో చంద్రబాబు గతంలో పలుమార్లు చర్చించారు. న్యాయశాఖ సలహాలు తీసుకోవాలని ఓసారి, బిల్లును తయారు చేయాలని మరోసారి, రాజ్యాంగాన్ని సవరించాలా, వద్దా అనే అంశంపై చర్చ జరగాలని ఇంకో సారి ఆయన చెబుతూ వచ్చారు.

మోడీ ఆమోదం కోసం...
సీట్ల పెంపునకు రాజ్యాంగ సవరణ మినహా మరో దారి లేదని న్యాయశాఖ అభిప్రాయపడి, బిల్లును కూడా సిద్ధం చేసి హోంశాఖకు పంపించింది. క్యాబినెట్ నోట్ కూడా సిద్ధం చేసి, పీఎంవో అనుమతి కోసం పంపించింది. దానిపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, అమిత్ షా పచ్చ జెండా ఊపితే మాత్రమే అది పార్లమెంటు ముందుకు వస్తుంది.

అమిత్ షా ఆలోచన మరో రకంగా...
సీట్ల పెంపు బిల్లుకు తెలంగాణ బీజేపీ నేతలతో పాటు ఎపి బిజెపి నేతలు కూడా అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంంటున్న బిజెపికి సీట్ల సంఖ్య పెంపు గొడ్డలి పెట్టు అవుతుంది. సీట్ల పెంచితే కెసిఆర్, చంద్రబాబులకు మాత్రమే మేలు జరుగుతుందనే అభిప్రాయం ఉంది. ఎన్నికల సమయంలో అసమ్మతులు, ఫిరాయింపులు, తిరుగుబాట్ల బెడదను వారు చాలా వరకు తప్పించుకోగలరు. పైగా, బిజెపి అభ్యర్థులు లభించడం కూడా కష్టమే. అందువల్ల అమిత్ షా తెలుగు రాష్ట్రాల బిజెపి నేతల మాటకు మాత్రమే విలువ ఇచ్చే అవకాశం ఉంది.

జగన్ కూడా...
అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచకూడదని రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్‌కు మద్దతు ఇచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోరినట్లు చెబుతున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించి తనను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు సీట్ల పెంపు ఉపయోగపడుతుందని, సీట్లు పెంచకపోతే చంద్రబాబు వ్యూహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు తిరిగి తనకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన భావిస్తున్నారు. బిజెపికి దగ్గరవుతున్న నేపథ్యంలో జగన్ మాటకు కూడా అమిత్ షా విలువ ఇచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications