వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశహర్మ్యాలతో: సూపర్ రాజధాని కష్టమైనా...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం ఎపి రాజధాని నిపుణుల కమిటీ అధ్యక్షుడు శివరామకృష్ణన్, ఇతర సభ్యులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాజధానిపై చర్చించారు. రాజధాని నిర్మాణం అంత సులభం కాదని కమిటీ చెప్పింది. ఎంత కష్టమైనా రాజధానిని నిర్మిస్తామని, పట్టణాలు, వనరుల పైన పూర్తి సమాచారం ఇవ్వాలని చంద్రబాబు వారిని కోరారు.

తక్కువ భూసేకరణతో రాజధాని నిర్మాణం జరగాలని, ఆకాశ హర్మ్యాలతో నిర్మిద్దామని, అలాగే వికేంద్రీకరృత అభివృద్ధి జరగాలని బాబు అన్నారు. ప్రాంతాల వారీగా పరిశ్రమల పైన చర్చించారు. భూమి వాటాలపై ఏ నిష్పత్తిలో ఇద్దామని కమిటీని చంద్రబాబు సలహా అడిగారు. వచ్చే నెలలో మరోసారి నివేదికలతో వారు బాబుతో భేటీ కానున్నారు. భూమీ వాటాలు 60:40 లేదా 55:45గా ఉండాలా అనే బాబు పలువురితో చర్చిస్తున్నారు.

Andhra Pradesh capital in skyscrapers

కాగా, ఇప్పటి వరకు రాజధాని ఎంపిక కోసం తాము చేసిన అధ్యయనంపై కమిటీ సభ్యులు చంద్రబాబుకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తాము పర్యటించిన ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత, ఉపాధి, ఇతర రంగాల్లో పరిస్థితి, రైల్వే, రోడ్డు, విమాన మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాలు, నీటి వనరుల లభ్యత తదితర అంశాలపై వివరాలు అందించారు.

మీరు తొమ్మిదేళ్లు గతంలో సీఎంగా పని చేశారని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఎన్నో కష్టనష్టాలు చూశారని, కానీ రాజధాని నిర్మాణం అనేది అంతకంటే కష్టమైనదని, వచ్చే ఐదేళ్లలో ఇంకా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిటీ బాబుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కొత్త రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతోపాటు విద్యుత్, నీటి కొరత కూడా తీవ్రంగానే ఉంటాయని అని శివరామకృష్ణన్ చెప్పినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు ఎంత కష్టమైనా రాజధాని నిర్మాణం చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ క్యాపిటల్, గ్రీన్ ఫీల్డ్ తరహాలో ఒక పెద్ద రాజధాని నిర్మించే పరిస్ధితి ప్రస్తుత రోజుల్లో క్లిష్టమైన ప్రక్రియేనని ఏపి రాజధాని నిపుణుల కమిటీ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్ అధికారి కెసి శివరామకృష్ణన్ తెలిపారు. రాజధాని విషయంలో వికేంద్రీకరణకే ప్రాధాన్యతనిస్తామన్నారు. బాబుతో భేటీ అనంతరం శనివారం కమిటీ సభ్యులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

పరిపాలనకు యోగ్యమైన రాజధాని ఏర్పాటుకు అనువైన నగరం దగ్గర ప్రదేశాన్ని గుర్తించడంతో పాటు, అదే తరహాలో వివిధ సంస్థలను నెలకొల్పేందుకు అవసరమైన మరో నాలుగు నగరాలు గుర్తిస్తామన్నారు. ఆగస్టు 31కంటే ముందే తాము నివేదికను కేంద్రానికి అందిస్తామన్నారు. తాము శనివారం ఉదయం సిఎం చంద్రబాబును కలుసుకుని రెండు గంటలపాటు చర్చించామన్నారు.

చంద్రబాబు పరిపాలనా అనుభవం, దార్శనికత ఉన్న నాయకుడని, తమకు అనేక సూచనలు చేశారని, కాని ఫలానాచోట రాజధాని ఉండాలని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తాము చేసే సిఫార్సులు సాంకేతికపరమైనవని, రాజధాని ఎంపిక బాధ్యతలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా, విభజనలో భాగంగా కేంద్రం నిధులు ఇస్తానందువల్ల కేంద్రం నిర్ణయం కూడా కీలకపాత్ర వహిస్తుందన్నారు.

ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు వ్యవసాయపరంగా ఆధారపడిన ప్రాంతాలంటూ, రాజధాని ఎంపిక అనేది రైల్, ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారి కనెక్టివిటీలపై ఆధారపడి ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వంద కొత్త నగరాలు నిర్మాణమయ్యాయని, ప్రస్తుత పరిస్ధితుల్లో అంత భారీ నగరాల నిర్మాణం సాధ్యం కాదన్నారు. వ్యవసాయానికి, పర్యావరణానికి హాని కలుగకుండా రాజధాని ఎంపిక ఉంటుందని, అలాగని చెప్పి వ్యవసాయ భూములకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా రాజధాని ప్రదేశం ఎంపిక చేయడం సాధ్యం కాదన్నారు.

గుంటూరు - విజయవాడ - తెనాలి నగరాల అనుసంధానానికి అవసరమైన చర్యలు తెలియచేయాలని సిఎం చంద్రబాబు కోరారన్నారు. తిరుపతి నగరాన్ని కూడా అన్ని హంగులు ఉన్న నగరంగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు పరిశీలించాలన్నారు. నీటి లభ్యత, పర్యావరణం, భూమి లభ్యత, ఆర్ధిక కార్యకలాపాలు, విద్యుత్, నౌక, విమానాశ్రయాల అనుసంధానం అంశాలను అధ్యయనం చేస్తున్నామన్నారు.

ఆంధ్రాలో సారవంతమైన నేలలు ఉండడం వల్ల వ్యవసాయోత్పత్తి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాలున్నాయని, ఇవన్నీ ఒకదానికొకటి పోటీపడే విధంగా ఉన్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దుర్గాపూర్, భిలాయ్, చండీగఢ్ లాంటి కొత్త నగరాలు నిర్మించినా, ఇప్పుడుంటే పరిస్థితుల్లో సాధ్యం కాదనే అభిప్రాయపడ్డారు.

English summary
The new capital of AP will have skyscrapers with important offices like the Secretariat, Assembly, High Court and commissionaires located in close vicinity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X