వారు సిమీ టెర్రరిస్టులు: నిరుడు జైలు నుంచి పరారీ?
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు దోపిడీ దొంగలకు ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్నాయనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు. అయితే వారిద్దరిని కూడా సిమీ ఉగ్రవాదులుగా గుర్తించారు. నిరుడు కాండ్వా జైలు నుంచి వారు పారిపోయినట్లు చెబుతున్నారు. అప్పుడు ఐదుగురు కాండ్వా జైలు నుంచి పరారయ్యారు. ఆ ఐదుగురిలో వీరిద్దరు ఉన్నారు.
వారిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అస్లాం అయూబ్, జాకీర్ బద్రూన్‌లుగా గుర్తించారు. సూర్యాపేటలో కాల్పులకు పాల్పడి ఇద్దరు పోలీసులను హతమార్చింది కూడా వీరేనని పోలీసులు నిర్ధారించారు.
బుధవారం అర్థరాత్రి సూర్యాపేటలో కాల్పులు జరిపి దొరబాబు అనే వ్యక్తి కారును దొంగిలించి పారిపోవడానికి వారు ప్రయత్నించారు. అయితే, అది సాధ్యం కాకపోవడంతో కాలి నడకన తప్పించుకున్నారు. దాంతో వారిద్దరు పరిసరాల్లోనే ఉంటారని అనుమానించిన పోలీసులు ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గత మూడు రోజులుగా వారి కోసం గాలిస్తూ వచ్చారు.

దోపిడీ దొంగలు ఇద్దరు కూడా శనివారం ఉదయం ఓ వ్యక్తిని బెదిరించి, అతని బైక్ తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు వారిని మూడు గంటల పాటు వెంటాడి పట్టుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు వారు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు, ఎస్సై సిద్ధయ్య మృతి చెందారు. మరో ఇద్దరు సిఐలు బాలగంగిరెడ్డి, గంగారాం గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించారు.
ఆపరేషన్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు కూడా పాల్గొన్నాయి. కాల్పుల ఘటన జరిగిన ప్రాంతం జానకీపురం నల్లగొండ జిల్లాలో ఉంది. అయితే, అది వరంగల్ జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. దోపిడీ దొంగలు అరవపల్లి వద్ద తల దాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని ఆలేరు చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికి చేరుకుంటే వారు రాష్ట్రం విడిచి పారిపోవడానికి వీలయ్యేది. ఆలేరు నుంచి రైలు సౌకర్యం చాలా ఎక్కువ. ఆలేరులో రైలు ఎక్కారంటే వారిని పట్టుకోవడం కూడా కష్టమయ్యేది.
ఎస్సైతో పాటు కానిస్టేబుల్ మరణించడంతో ఆత్మకూరు (ఎం) పోలీసు స్టేషన్ వద్ద విషాద వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరిని పోగొట్టుకున్న పోలీసులు కన్నీరు మున్నీరవుతున్నారు.












Click it and Unblock the Notifications