అభివృద్ధి ప్రణాళిక, ఇరువైపులా: రాజధాని అక్కడే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య ఉంటుందని అనధికారికంగా దాదాపు ఖరారు అయిపోయినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. రాజధాని నిర్మాణం విజయవాడ -గుంటూరు మధ్యే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీకి కూడా స్పష్టం చేసింది. అలాగే గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
మంగళవారం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాజధాని అధ్యయనం కోసం తాము సింగపూర్ వెళ్లనున్నట్లు చెప్పారు. అదే సమయంలో వీటీటీఎం పరిధిలో 184 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికలు ఉన్నట్లు చెప్పారు. గతంలో మంత్రులు, సీఎం చంద్రబాబులు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తద్వారా అక్కడే రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, దీనిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రావాల్సి ఉంది.
గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నిర్మాణానికి 90వేల కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మించేందుకు మాత్రం 1.5 లక్షల కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.

రాజధాని నిర్మాణంలో అనేక ప్రాంతాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతం పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రాంతమైతే అన్ని విధాలా రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండటం, నీటి లభ్యత సమృద్ధిగా ఉండటం కూడా ఈ ప్రాంతానికి కలిసొచ్చేదిగా ఆయన భావిస్తున్నారు. అందుకే ఇటీవల రాష్ట్రానికి వచ్చిన శివరామకృష్ణన్ కమిటీకి కూడా తన అభిప్రాయంగా ఈ ప్రాంతాన్నే సూచించారు.
ఇలా ఉండగా రాజధాని నిర్మాణంపై ఈ ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించకున్నా, అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందుగా కొత్త రాజధాని నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 184 కిలోమీటర్ల విస్తీర్ణంలో రింగ్ రోడ్డు ఏర్పాటుకానుంది. అంతేకాకుండా కృష్ణా నదికి రెండు వైపులా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు యోచిస్తున్నారు.
కొత్త రాజధాని అవసరాలకు ప్రత్యేకంగా 30 టిఎంసిల నీటిని కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల వనరుల సంఘానికి లేఖ రాసింది. రాజధానికి నీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ముందుగానే కేంద్రానికి ఈ ప్రతిపాదనలు పంపించారు. మరోవైపు, భిన్న ప్రభుత్వ కార్యాలయాలు విడివిడిగా కాకుండా అన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేయాలని కూడా దాదాపు నిర్ణయం తీసుకున్నారు.
రాజధాని ఎంపికకు, తరువాత డిజైన్ ఏర్పాటుకు ఆరు నెలల కాలం పడుతుందని, తరువాత దశలవారీగా రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. వందేళ్ల తరువాత అవసరాలకు అనుగుణంగా కొత్త రాజధాని నిర్మాణం ఉండాలన్నదే చంద్రబాబు భావనగా ఆయన వెల్లడించారు. సింగపూర్‌లో నగర నిర్మాణాన్ని, వారి ప్రణాళికలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్లానింగ్ శాఖ నుంచి ఒక అధికారిని సింగపూర్ పంపించాలని నిర్ణయించినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications