బిజెపి గేమ్ ప్లాన్: కెసిఆర్ ఇన్, చంద్రబాబు ఔట్?
హైదరాబాద్: నిప్పు లేకుండా పొగ రాదని తెలుగు సామెత. తెలుగు రాష్ట్ర్లాల రాజకీయాల విషయంలో అదే జరగబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బిజెపికీ, ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరవుతుండగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బిజెపి వ్యూహరచన కూడా అందుకు అనుగుణంగానే సాగుతున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే, పూర్తిగా కేంద్రానికి దూరమవుతామనే మాట మాత్రం మాట్లాడలేదు. ఒత్తిడి తేవడం ద్వారా కేంద్రం నుంచి న్యాయం చేసుకుందామనే పద్ధతిలో తన మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు నచ్చజెపుతున్నారు. అయితే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు అనుమతిస్తే కేంద్రంపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపి శివప్రసాద్ అన్నారు.
తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద పెట్టామని, తాము విరాటపర్వంలో పాండవులమని, తమ నాయకుడు అనుమతిస్తే ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి దింపుతామని ఆయన అన్నారు. ఆయన మాటల్లోని ఆంతర్యం సులభంగానే అర్థమవుతోంది. చంద్రబాబు అనుమతి ఇస్తే కేంద్రంపై అమీతుమీ తేల్చుకుంటామనేది ఆయన మాటల్లోని ఆంతర్యం. శివప్రసాద్ ఆ మాటలు అన్న రోజునే చంద్రబాబు ఎపికి జరిగిన అన్యాయంపై తీవ్రంగా మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.

ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తలొగ్గుతుందా అనేది అనేది అనుమానమే. అయితే, చంద్రబాబుపై పార్టీ నాయకుల నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఎపికి ప్రత్యేక హోదా కల్పించకపోవడం, రాజధాని భూముల విషయంలో ఆటంకాలు ఆయనను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి బయటకు రావాలనే డిమాండ్ కూడా వస్తోంది. ఈ స్థితిలో చంద్రబాబు తన మంత్రులకు, ఎంపిలకు సర్దిచెప్పినట్లు సమాచారం. వారి ఆగ్రహాన్ని కాస్తా చల్లార్చే ప్రయత్నం చేశారని అంటారు. కానీ, అలా చంద్రబాబు ఎంత వరకు నెట్టుకు రాగలరనేది ప్రశ్న. తనంత తానుగా చంద్రబాబు ఎన్డిఎ నుంచి తప్పుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయనే మాట వివిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని, ఒత్తిడికి కూడా కేంద్రం దిగి రాకపోతే మోడీ ప్రభుత్వం నుంచి తప్పుకుందామని చంద్రబాబు మంత్రులకు, ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. చంద్రబాబును ప్రధానంగా నాలుగు సమస్యలు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒకటి - రైల్వే బడ్జెట్‌లో విశాఖను ప్రత్యేక జోన్‌గా ప్రకటించకపోవడం. రెండు, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం. మూడు, రాష్ట్ర రాజధానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి అందకపోవడం, నాలుగు, పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించడం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ దిగదిడుపుగా ఉన్న స్థితిలో కేంద్రం పూర్తి స్థాయిలో సాయం చేయడానికి ముందుకు రాకపోవడం చంద్రబాబును తీవ్ర నిరాశకు, ఆవేదనకు గురి చేసినట్లు చెబుతున్నారు. మోడీ ప్రభుత్వంలో ఉండడం వల్ల, బిజెపితో కలిసి పనిచేయడం వల్ల ఎపికి ఇతోధిక సాయం అందుతుందని భావించిన చంద్రబాబు అదే మాటను ప్రజలకు చెప్పారు. బహుశా, ఆ హామీ వల్లనే ప్రజలు టిడిపిని గెలిపించి ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏ విధమైన సమాధానం చెప్పాలనేది, ప్రజలకు ఏ విధంగా నచ్చజెప్పాలనేది చంద్రబాబు ముందు ఉన్న పెద్ద సమస్య. దీంతో ఆయన అనివార్యంగానే బిజెపితో తెగదెంపులు చేసుకునే పరిస్థితి రావచ్చునని అంటున్నారు. అదే జరిగితే బిజెపి అనుకున్నదే జరుగుతుందని అంటున్నారు.
ఇకపోతే, కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ విమర్సలు అంత తీవ్రంగా లేవు. నామమాత్రంగా ఆ పార్టీ విమర్శలు పెడుతోందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే, టిఆర్ఎస్‌కు, బిజెపికి మధ్య వచ్చిన అవగాహన మేరకే అంతా జరుగుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. టిఆర్ఎస్ ఎప్పటికైనా, తనకు అనుకూలంగా ఉన్న స్థితిలో బిజెపితో కలిసి ఎన్డిఎ ప్రభుత్వంలో చేరవచ్చుననే మాట వినిపిస్తోంది. ఇప్పుడు అశోక్ గజపతి రాజు కేంద్రంలో నిర్వహిస్తున్న పౌర విమాన యానాల శాఖ కెసిఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు దక్కవచ్చునని అంటున్నారు. సీనియర్ నేత కేశవ రావుకు కూడా మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. అటు చంద్రబాబు బయటకు వెళ్లడం, ఇటు కెసిఆర్ ఎన్డియేలో చేరడం ఏక కాలంలో జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
కాగా, చంద్రబాబుపై కాంగ్రెసుతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తీవ్ర విమర్శలు పెడుతున్నాయి. కేంద్రం నుంచి తగిన సాయం రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి. అదే విధంగా రాజధానికి భూముల సేకరణ వ్యవహారం కూడా వివాదంగా మారుతోంది. ఈ స్థితిలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ గొడుగు కిందికి బిజెపి తీసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెసు తిరిగి తలెత్తకుండా చేసేందుకు అనువైన బిజెపి వ్యూహంలో భాగంగానే అంతా జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైన మార్గం పడుతాయనే ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications