రేవంత్‌పై సండ్ర అసంతృప్తి: బాస్, సార్ ఎవరో తెలిసింది
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో సూత్రధారికి సంబంధించిన కీలకమైన ఆధారాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) రాబట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య విచారణలో ఆ విషయం బయటపడినట్లు చెబుతున్నారు. నోటుకు ఓటు వ్యవహారాన్ని నడిపినవారు బాస్, సార్ అంటూ పదే పదే ప్రస్తావించిన విషయం తెలిసిందే.
వారి సంభాషణల్లో ప్రస్తావించిన బాస్, సార్ ఎవరనేది ఎసిబి అధికారులు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వారి లక్ష్యం ఏమిటనేది కూడా వారు కనిపెట్టినట్లు చెబుతున్నారు. నోటుకు ఓటు కేసులో నిందితుడైన సెబాస్టియన్‌ను శుక్రవారంనాడు తమ కార్యాలయానికి రప్పించి ఎసిబి అధికారులు సండ్రకు ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు సమాచారం.
కేసులో మిస్సింగ్ లింకులను ఎసిబి అధికారులు ఈ విచారణలో కనిపెట్టినట్లు సమాచారం. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సండ్ర తర్ఫీదు పొందినట్లు భావిస్తున్నారు. దీంతో ఆయన ఎసిబి అధికారుల ప్రశ్నలకు ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తపడ్డారని అనుకుంటున్నారు. ఈ స్థితిలో సెబాస్టియన్‌తో ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం వల్ల కొన్ని విషయాలు బయటకు వచ్చినట్లు చెబుతున్ారు
సండ్ర గన్‌మన్ లచ్చు ఇంతకు ముందు వాంగ్మూలం ఇచ్చాడు. అతని వాంగ్మూలం ఆధారంగా తొలుత సండ్రను ఎసిబి అధికారులు ప్రశ్నించారు. మే 29వ తేదీన మహానాడు ముగిసిన తర్వాత 30వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు అక్కడి నుంచి లేక్‌వ్యూ అతిథిగృహానికి వెళ్లారు. ఈ విషయాలను లచ్చు తన వాంగ్మూలంలో చెప్పాడు.

అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఎసిబి అధికారులు ప్రశ్నించారని, దానికి పార్టీ వ్యవహారాలు, ఇతర వ్యవహారాలు అంటూ సండ్ర అస్పష్టమైన సమాధానాలు ఇచ్చారని అటున్నారు. మే 31వ తేదీన రేవంత్ రెడ్డి నేరుగా రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్‌సన్ నివాసానికి వెళ్లడం పట్ల సండ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎసిబి వద్ద సమాచారం ఉందని అంటున్నారు.
జనార్దన్ వ్యవహారంపై కూడా ఎసిబి అధికారులు ప్రశ్నించారని అంటున్నారు. మే 30వ తేదీ ఉదయం చంద్రబాబు నివాసం నుంచి నేరుగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు సండ్ర వెళ్లడం జనార్దన్‌ను కలవడానికేనా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జనార్దన్ నేతృత్వంలోనే జరిగిందా అంటూ ఎసిబి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
జిమ్మీ గురించి కూడా ఎసిబి అధికారులు సండ్రను ప్రశ్నించారు. జిమ్మీ ఎలా తెలుసునని అడిగితే, ఆయనతో పెద్దగా పరిచయం లేదని, పార్టీ వ్యవహారాల్లో అప్పుడప్పుడు మాట్లాడేవాడినని సండ్ర చెప్పినట్లు తెలుస్తోంది. తాను కూడా పార్టీలో క్రైస్తవ వ్యవహారాలను చూస్తుంటానని, దానిలో భాగంగానే సెబాస్టియన్‌తో మాట్లాడి ఉంటానని ఆయన చెప్పారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన విషయంపై కూడా ఎసిబి అధికారులు ఆరా తీశారు. ఒకే జిల్లాకు చెందినవాళ్లం కాబట్టి వారితో మామూలుగా మాట్లాడి ఉంటానని, ఏం మాట్లాడానో గుర్తు లేదని సండ్ర వారికి చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications