మోడీపై మోజు: బిజెపితో పొత్తుకు బాబు సై?

Narendra Modi - Chandrababu Naidu
హైదరాబాద్: గత కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గుజరాత్ అభివృద్ధిపై ఆయన మోజు పడుతున్నట్లు కనిపిస్తోంది. తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కన్నా ఎక్కువ అభివృద్ధి చెంది ఉండేదని పదే పదే చెబుతున్నారు. దాంతో చంద్రబాబు బిజెపికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయనే ప్రచారం ఊపందుకుంది. మతతత్వ ఎజెండాను మరుగుపరిచి, అభివృద్ధి ఎజెండాతో బిజెపితో దోస్తీకి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

బిజెపితో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనే విషయంపై తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాతి పరిణామాల్లో ఈ ఉభయ పార్టీల నాయకత్వాల మధ్య సంప్రదింపులకు తెరలేచింది. ఇది ఇరు పార్టీల మధ్య స్నేహానికి దారి తీయవచ్చునని అంటున్నారు. 1998 నుంచి 2004 వరకూ బిజెపి, తెలుగుదేశం మిత్రపక్షాలుగా ఉన్నాయి.

2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలోని సమీకరణాల దృష్ట్యా బిజెపికి తెలుగుదేశం దూరంగా జరిగింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో మైనారిటీలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిపోవడం, వామపక్షాలు దూరం కావడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత ఆ పార్టీ వామపక్షాలతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుని వాటిని కొనసాగిస్తూ వచ్చింది. జాతీయస్థాయిలో తృతీయ ఫ్రంట్ పార్టీలు, వామపక్షాలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత సమీకరణాల్లో ఒక్కసారిగా గణనీయ మార్పు వచ్చింది. రాజకీయంగా తమను దెబ్బ కొట్టే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని ప్రయోగించిందని చంద్రబాబు అంటున్నారు.

కాంగ్రెసు వ్యూహాన్ని తిప్పికొట్టడానికి అవసరమైన అన్ని మార్గాలనూ తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తోంది. ఈ స్థితిలోనే జాతీయ నేతలు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల ఆందోళనకు నైతిక మద్దతునిచ్చారు. దీంతో ఈ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం తెలంగాణ నేతలు కూడా బిజెపితో పొత్తుకు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి ఉత్సుకత ప్రదర్శిస్తోంది. తెలంగాణ, సీమాంధ్రల్లో నమ్మదగిన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీయే అని, ఈ పొత్తు వల్ల రెండు పార్టీలు ప్రయోజనం పొందుతాయని బిజెపి నాయకులు భావిస్తున్నారు. బిజెపి జాతీయ నేత ఎం. వెంకయ్యనాయుడు ఇరు పార్టీల మధ్య స్నేహసంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసువైపు మొగ్గు చూపుతున్నట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం, బిజెపి కలిస్తే తెలంగాణలో కాంగ్రెసు, తెరాస కూటమికి, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసుకు గట్టి పోటీ ఇవ్వడానికి తగిన బలం సమకూరుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+