‘ఏపీ’కి ఆ పేరు ఎందుకు?: 'తీసేద్దామనుకున్నాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ త్వరలో ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. విభజన బిల్లు తయారీలో జైరాం రమేశ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర విభజన పరిణామాలపై ఆయన ఓ పుస్తకం రచించారు.
త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో విభజనకు సంబంధించి ఆయన అనేక ఆసక్తికర విషయాలను పొందురపరిచారని తెలుస్తోంది. ముఖ్యంగా ‘‘తెలంగాణ' ఇచ్చేసిన తర్వాత... 13 జిల్లాల ‘ఆంధ్రప్రదేశ్'కు ఆ పేరు ఎందుకు? ఆ పేరూ మార్చేద్దాం!'' అని ఓ ప్రతిపాదన కూడా వచ్చిందంట.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఒక దశలో ‘ఆంధ్రప్రదేశ్' అనే పేరును లేకుండా చేయాలని భావించింది. 13 జిల్లాల నవ్యాంధ్రకు పేరు ఎందుకు మార్చాలనుకున్నారు, కొత్తగా ఏ పేరు పెట్టాలనుకున్నారు తదితర వివరాలను జైరామ్ తన పుస్తకంలో వివరించారట.

దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి గల కారణాలతో పాటు తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన తర్వాత జరిగిన పరిణామాణాలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏపీ నేతలు ఎలా అడ్డుపడ్డారు? ఆ అడ్డంకులన్నిటినీ అధిష్ఠానం ఎలా అధిగమించింది?
లాంటి అనేక ఆసక్తికర మైన అంశాలను జైరాం రమేశ్ ఆ పుస్తకంలో ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్రకు చెందిన ఎంపీల పాత్రను కూడా అందులో ప్రస్తావించారట.
విభజన సమయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్'ను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? విషయాల గురించి ఆ పుస్తకంలో వివరించారట. తెలంగాణ ఏర్పాటుకు నియమించిన జీవోఎంలో కీలకంగా వ్యవహరించిన జైరాం రమేశ్ తన వ్యాఖ్యలను ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టులు ఆయా సందర్భాలను బట్టి ఎలా అన్వయించుకొని రాశారనే అంశానికి ప్రత్యేకంగా ఒక అధ్యాయం కేటాయించారట.
జీవోఎం సమావేశం ముగించుకొని బయటకు వచ్చి తాను ‘గోవిందా.. గోవింద' అని చెప్పినప్పుడు కేంద్రం తెలంగాణ ఇవ్వడానికి మొగ్గు చూపినట్లు జర్నలిస్టులు ఎలా పసిగట్టారు? రాయల్ తెలంగాణపై చర్చలు జరుగుతున్నప్పుడు ‘సమయం 10-12 అయ్యింది' అంటూ తను చేసిన వ్యాఖ్యలపై 10 జిల్లాల తెలంగాణా? 12 జిల్లాల తెలంగాణా? అంటూ విలేకరులు ఎలా వార్తలు రాశారో పేర్కొన్నారట.












Click it and Unblock the Notifications