తెలుగు రాష్ట్రాల్లో కుంభకోణాలు: బాబు, కేసీఆర్ మధ్య తేడా ఇదీ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల అభివృద్ధి కోసం తమ శక్తి మేర పని చేస్తున్నారు.
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల అభివృద్ధి కోసం తమ శక్తి మేర పని చేస్తున్నారు. అయితే, తమ రాష్ట్రాల్లో జరుగుతున్న స్కాములపై స్పందించే తీరులో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చాలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో ఏవైనా అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి చర్యలు తీసుకుంటున్నారని.. అదే ఏపీలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందన సరిగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వెంటనే స్పందించి చర్యలకు ఆదేశిస్తుంటే.. చంద్రబాబు మాత్రం అలాంటి వ్యవహారాలపై కనీసం ప్రకటన కూడా చేయకపోవడం చర్చకు దారితీస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో భూ కుంభకోణాలు
ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో(హైదరాబాద్, విశాఖపట్నం) ఇటీవల చోటు చేసుకున్న భూ కుంభకోణాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని మియాపూర్, బాలానగర్ ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్టేషన్ల భారీ కుంభకోణం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

కేసీఆర్ స్వయంగా..
అయితే, రిజిస్ట్రేషన్ల శాఖలో చోటు చేసుకున్న అవినీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు అధికారులపై వేటు పడింది. మరో అధికారి అరెస్టయ్యారు. అంతేగాక, రాత్రికి రాత్రే 29మంది సబ్ రిజిస్ట్రార్ల బదిలీ జరిగిపోయింది. ఆ తర్వాత ఎష్ఆర్ఓల విచక్షణాధికారాలు కూడా పూర్తిగా రద్దయ్యాయి. అంతేగాక, అవినీతి, అక్రమాలకు అవకాశంగా మారిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పోలీసులు, ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. ట్రినిటీ ఇన్ ఫ్రా, సువిశాల్ పవర్ జెన్, గోల్డ్ స్టోన్ సంస్థలు భూ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. ఇంకా పెద్ద తలకాయలు కూడా ఈ స్కాంలో ఉన్నట్లు సమాచారం. వారిపైనా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిద్దాం.

కొన్నింట్లో ఆరంభ శూరత్వమే
అయితే, నయీం కేసు, ఓటుకు నోటు కేసు, నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత వంటి వాటి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఆరంభ శూరత్వం అన్నట్లు వ్యవహరించి ఆ తర్వాత ఈ అంశాలను పట్టించుకోకపోవడంతో ప్రజలను కొంత సందిగ్ధంలో పడేసింది. అక్రమాలపై వెంటనే స్పందించి ఆ తర్వాత దాన్ని అర్ధాంతరంగా వదిలేయడం చర్చకు దారితీస్తోంది.

చంద్రబాబు స్పందనేది?
ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయానికొస్తే.. విశాఖపట్నంలో జరిగిన వందల కోట్ల భూ దందాపై ఇప్పటికీ నేరుగా స్పందించలేదు. అయితే, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాత్రం విశాఖపట్నం భూ దందాపై బహిరంగ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. 6వేల ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగినట్లు దాదాపు అన్ని పత్రికలు, మీడియా ఛానళ్లలోనూ వార్తలు వచ్చాయి. అంతేగాక, అధికార పార్టీ నేతలే ఈ అక్రమ దందాలో భాగస్వాములైనట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ కారణంగానే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగలేకపోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

బాబు, కేసీఆర్ మధ్య తేడా.. ప్రజలు కోరేది ఇది
తెలంగాణలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అవినీతి, కుంభకోణాలపై వెంటనే స్పందిస్తుండగా, ఏపీలో మాత్రం చంద్రబాబు కొన్నింటిపైనే సీరియస్‌గా స్పందించి.. మరికొన్నింటిని విస్మరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు కఠినంగా వ్యవహరించాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications