హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త పార్టీ కోసం ఎదురుచూపులు: కిరణ్ ఆడుగులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజన వైపు వేగంగా అడుగులు వేయడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. సిడబ్ల్యూసి నిర్ణయం పైన తొలి నుండి అసంతృప్తితో ఉన్న కిరణ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతూ.. తాను ఫైలిన్ తుఫాను ఆపలేకపోయినా విభజన తుఫానును ఆపుతానని వ్యాఖ్యానించారు.

దీంతో కొత్త పార్టీ మరోసారి చర్చల్లోకి వచ్చింది. కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి కిరణ్ సొంత కుంపటి పెడతారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కిరణ్ సమైక్య శంఖం పూరిస్తూ సొంత పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారా!?, వ్యూహాత్మకంగా అధిష్టానానికి దూరమవుతున్నారా!? అంటే ఆయన హావభావాలు, నర్మగర్భ వ్యాఖ్యలు చూస్తుంటే సొంత పార్టీ కిరణ్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తున్నట్లుగా ఉందంటున్నారు.

Kiran Kumar Reddy

సిడబ్ల్యూసి నిర్ణయం, కేబినెట్ టి నోట్ తర్వాత కొందరు కాంగ్రెసు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. ఇంకొందరు తర్జన భర్జన పడుతున్నారు. అదే సమయంలో కిరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో నానుతోంది. దీంతో, ఇటు టిడిపిలోకి, అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లలేని నేతలు కిరణ్ కొత్త పార్టీ ఎప్పుడు పెడతారా? అని ఎదురు చూస్తున్నారంటున్నారు.

సమైక్యవాదంతో కిరణ్ కొత్త పార్టీ పెడితే రాజకీయంగా తమకు మళ్లీ పునర్జన్మ వచ్చినట్లేనని కూడా భావిస్తున్నారట. తాను సమైక్యవాదినని చెప్పుకొంటున్న కిరణ్ తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తే అడ్డుకునే అవకాశముంది. సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకునేందుకు వీలుగా అధిష్ఠానంపై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ పెద్దల విషయంలో ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారట. వారు ఫోన్ చేసినప్పటికీ తాను ఎక్కడైనా సమైక్యవాదమే వినిపిస్తానని ఒకింత ఘాటుగానే చెబుతున్నారట.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎవరైనా అంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెసు నేతలు నిప్పులు చెరుగుతారు. కిరణ్ కూడా అలా చేసిన సందర్భాలున్నాయి. కానీ, తన సొంత జిల్లాలో సోనియా దిష్టిబొమ్మను తయారు చేసి సమాధి కట్టినా, దీనిపై పెద్ద దుమారమే చెలరేగినా ఆయన మాత్రం స్పందించలేదు. సీమాంధ్ర ప్రజల దృష్టిలో సోనియా గాంధీనే విభజనకు కారకురాలని, ఆమెకు అనుకూలంగా మాట్లాడితే సీమాంధ్ర ప్రజలు తన చిత్తశుద్ధిని శంకిస్తారన్నది కిరణ్ అభిప్రాయంగా ఉండవచ్చునని అంటున్నారు. అందుకే ఆయన స్పందించక పోయి ఉంటారంటున్నారు.

ఇక రాష్ట్ర విభజనపై ఆగమేఘాలపై పరుగులు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలోని 13 జిల్లాల్లోనూ పుట్టగతులుండవని ఇప్పటికే పలు సర్వేల్లో స్పష్టమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతే ఆ మేరకు లబ్ధి పొందడానికి అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరపాలంటూ బాబు ఢిల్లీలో దీక్ష చేశారు. ఒక విడత ఆత్మ గౌరవ యాత్ర నిర్వహించి మలి విడతకూ సిద్ధమవుతున్నారు. జగన్ కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.

అయితే, బాబు, జగన్ ఇద్దరూ తొలుత విభజనకు సానుకూలత ప్రకటించి ఇప్పుడు సమ న్యాయ సిద్ధాంతాన్ని తెర పైకి తెచ్చారని, తానొక్కడినే మొదటి నుంచీ సమైక్య నినాదాన్ని తలకెత్తుకున్నందున ప్రజల్లో తనకే ఎక్కువ ఆదరణ ఉంటుందని కిరణ్ అంచనా వేసుకుంటున్నారట. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ అధిష్ఠానంపై తన దాడిని కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో తన వాదనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో విభజన నిర్ణయాన్ని అడ్డుకుంటానని చెప్పిన కిరణ్ ఇప్పటికిప్పుడు సొంత పార్టీ ఆలోచనను బయటపెట్టే స్థితిలో లేరంటున్నారు. విభజనపై తీర్మానం లేదా బిల్లు అసెంబ్లీకి వస్తే అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు. విభజన ప్రక్రియలో తాను భాగస్వామిని కాలేనని గతంలోనే సోనియాకు స్పష్టం చేసిన కిరణ్.. బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కథ నడిపి.. అది పార్లమెంట్‌లో ఆమోదం పొందే సమయానికి అటు ప్రభుత్వం, ఇటు పార్టీ నుంచి తప్పుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజల్లో చాంపియన్‌గా నిలబడాలని భావిస్తుండవచ్చునని అంటున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం బిల్లును అడ్డుకున్నాను అనే మాటపై ప్రజల్లోకి వెళ్లడానికి వీలుగా ఆయన ఈ వ్యూహం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా సీమాంధ్రలో బాబు, జగన్ కంటే తనకే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ కిరణ్ ఎత్తుగడలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ పార్టీ కఠిన వైఖరి అవలంభిస్తే దానిని కూడా తనకు అనుకూలంగా మలచుకొని సొంత పార్టీతో జనం ముందుకు వెళ్లాలని కిరణ్ భావిస్తున్నారట.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని ఇంకొందరు చెబుతున్నారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురి కాంగ్రెసు నేతల నుండి కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి కిరణ్ కుమార్ రెడ్డి పైన వస్తోందని అంటున్నారు. విభజనపై అధిష్టానం దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కొత్త పార్టీ పెడితేనే భవిష్యత్తు ఉంటుందని కిరణ్‌కు చెబుతున్నారట.

English summary
CM Kiran Kumar Reddy is increasingly under pressure from a section of his party MLAs from the Seemandhra region to launch a new party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X